- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడి
- ప్రతీకార దాడులపై ప్రణాళిక
- 180కి చేరిన మృతుల సంఖ్య
- మాటల్లో తడబాటు.. విలేకరుల ప్రశ్నలకు మౌనం
- పౌరుల తరలింపు 31లోపు పూర్తి చేస్తామని పునరుద్ఘాటన
- ఎయిర్‌పోర్టులో దాడులు మా పనే: ఐసిస్-ఖోరసాన్
కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రదాడి తమ పనే అని అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఐసిస్-ఖోరసాన్(ఐఎస్-కే) ప్రకటించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి ఫొటోతో కూడిన ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. గురువారం రాత్రి కాబూల్ ఎయిర్‌పోర్టులో జరిగిన అత్మాహుతి, బాంబు దాడుల్లో దాదాపు 180 మంది చనిపోయారు. చనిపోయినవారిలో అమెరికా సైనికులు 13 మంది ఉన్నారు. కాబూల్‌లో పేలుళ్లకు బాధ్యులైనవారు తప్పక మూల్యం చెల్లించుకొంటారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రతీకార దాడులు తప్పవని, వారిని వెంటాడి వేటాడి చంపుతామని హెచ్చరించారు.
కాబూల్ పేలుళ్ల అనంతరం గురువారం బైడెన్ అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని, వారు హీరోలు అని అభివర్ణించారు. అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్-కే స్థావరాలపై దాడికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ‘కాబూల్‌లో పేలుళ్లకు బాధ్యులైన వారిని, అమెరికాకు హాని తలపెట్టాలని చూసినవారిని మేం ఎప్పటికీ మర్చిపోం. క్షమించం. వదిలిపెట్టం. వెంటాడి వేటాడుతాం. వాళ్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని తీవ్ర భావోద్వేగంతో అన్నారు. అఫ్గానిస్థాన్ నుంచి పౌరులను తరలించడాన్ని ఉగ్రదాడులు అడ్డుకోలేవని, కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకల్లా అమెరికా పౌరులందరినీ ఎట్టి పరిస్థితుల్లోనైనా అఫ్గానిస్థాన్ నుంచి తరలిస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు దాదాపు లక్ష మందిని తరలించినట్టు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాలిబన్లు మంచోళ్లు కాదు
ప్రసంగం సమయంలో బైడెన్ మొహంలో దిగులు కనిపించింది. మాట తడబడింది. మాటల మధ్యలో, విలేకరులకు సమాధానం ఇచ్చే సమయంలో ఆయన తలవంచుకొన్నారు. కొద్ది సేపు మౌనం వహించారు. ఐఎస్-కే అఫ్గానిస్థాన్‌లో విస్తరించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తాలిబన్లపై ఉందని బైడెన్ ఈ సందర్భంగా అన్నారు. తాలిబన్లు, ఐఎస్ కలిసే దాడులకు పాల్పడ్డాయన్న వార్తలను ఆయన ఖండించారు. అందుకు ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ‘తాలిబన్లు మంచివాళ్లు కాదు’ అని ఓ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గమనార్హం.
బైడెన్ రాజీనామాకు డిమాండ్లు
అఫ్గాన్ నుంచి హడావుడిగా బలగాలను రప్పించి బైడెన్ సర్కారు ఇంటా.. బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ పొలిటికో వార్తా సంస్థ కీలక అంశాన్ని వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌లో తమకు సాయం చేసిన వారి జాబితాను స్వయంగా అమెరికా అధికారులే తాలిబన్లకు అప్పజెప్పారని తెలిపింది. ‘ఆగస్టు 15న కాబూల్ ఆక్రమణ తర్వాత అమెరికా అధికారులు తాలిబన్లకు ఓ జాబితా ఇచ్చారు. అందులో అఫ్గానిస్థాన్‌లో ఉన్న అమెరికా పౌరులు, గ్రీన్ కార్డు హోల్డర్లు, సహాయకులు, అనువాదకుల పేర్లు ఉన్నాయి’ అని పేర్కొన్నది. విమానాశ్రయంలోకి వారిని అనుమతించాలని జాబితా అందజేసినట్టు సమాచారం. దీనిని అమెరికా అధికార వర్గాలు ఖండించలేదు. తాలిబన్లు అదే జాబితాను పట్టుకొని ఇంటింటి వేట సాగిస్తున్నట్టు పొలిటికో చెప్పింది. ఇదిలా ఉండగా, గురువారం ఉగ్రదాడిలో అమెరికా సైనికుల మరణం నేపథ్యంలో బైడెన్ రాజీనామా చేయాలని రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది అభిశంసనకు పిలుపునిచ్చారు. 2011 తర్వాత విదేశాల్లో అమెరికా సైనికులు ఈ స్థాయిలో చనిపోవడం ఇదే తొలిసారి.
ప్రజలకు నచ్చజెప్పండి
దేశంలో తాము అమలు చేస్తున్న నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ప్రజలకు చెప్పాలని తాలిబన్లు ఇమామ్‌లకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు శుక్రవారం ప్రార్థనలను వేదికగా చేసుకోవాలన్నారు. గురువారం కాబూల్‌లో ఉగ్రదాడి అనంతరం వారు ఈ విజ్ఞప్తి చేశారు. గత శుక్రవారం కూడా తాలిబన్లు.. తమపై వస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలు దేశం విడిచివెళ్లిపోకుండా వారికి నచ్చజెప్పాలని ఇమామ్‌లను కోరారు.