ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల వెల్లువతో 2019-20లో బీజేపీ ఆదాయం 50 శాతం పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ఆధారంగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చురకలు వేశారు. 2019-20లో బీజేపీ ఆదాయం 50 శాతం పెరిగిందనే వార్తా కధనాన్ని ట్విటర్‌లో రాహుల్ షేర్ చేస్తూ బీజేపీ రాబడి 50 శాతం పెరిగింది మరి మీ ఆదాయం సంగతేంటి..? అని రాహుల్ ట్వీట్ చేశారు.
2018-19, 2019-20 మధ్య బీజేపీ ఆదాయం రూ 2410 కోట్ల నుంచి రూ 3623 కోట్లకు పెరిగిందని, ఈ వ్యవధిలో కాషాయ పార్టీ రాబడి ఏకంగా 50.34 శాతం వృద్ధి చెందిందని ఏడీఆర్ నివేదిక శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ఆదాయం రూ 918 కోట్ల నుంచి రూ 682 కోట్లకు పడిపోయిందని ఏడీఆర్ పేర్కొంది. ఇక ఎన్సీపీ ఆదాయం అత్యధికంగా 68.77 శాతం పెరగడం గమనార్హం. 2018-19లో ఎన్సీపీ ఆదాయం రూ 50.7 కోట్లుగా నమోదవగా 2019-20లో అది రూ 85.5 కోట్లకు ఎగిసింది.