భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccine) ప్రక్రియ చురుకుగా సాగుతున్నది. యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపడుతుండగా.. శుక్రవారం ఒక్క రోజులోనే కోటి డోసులు వేశారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్ భారతదేశానికి అభినందనలు తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 60.4 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా, 13.6 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇలా ఉండగా, కరోనా మార్గదర్శకాలను వచ్చే నెల 30 వరకు కేంద్రం పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
భారత్‌లో ఒక్క రోజులోనే కోటి మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం పట్ల సౌమ్యాస్వామినాథన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆమె భారతదేశం ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ‘వయోజన జనాభాలో 50 శాతం మందికి భారతదేశం టీకా (కనీసం ఒక మోతాదు) ఇచ్చింది. ఇప్పటివరకు మొత్తం 62 కోట్ల డోస్‌లు ఇచ్చారు. అందులో శుక్రవారం కోటి డోస్‌లు ఇవ్వడం నిజంగా అభినందనీయం. ఈ ప్రచారంలో పాల్గొన్న వెయ్యి మందికి పైగా కార్యకర్తలకు అభినందనలు. వ్యాక్సిన్‌తో కరోనా నుంచి ప్రజారోగ్యం, నివారణ పద్ధతులను అనుసరించడం ద్వారా మనమందరం సురక్షితంగా ఉందాం’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పూర్తి టీకాల లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశానికి డిసెంబర్ 31 లోపు ప్రతిరోజూ 1 కోటి వ్యాక్సిన్ మోతాదులను ఇంజెక్ట్ చేయాలని టీకాపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ అధిపతి డాక్టర్ ఎన్‌కె అరోరా తెలిపారు.
ఇది పెద్ద విజయం : నరేంద్ర మోదీ
దేశానికి ఇది పెద్ద విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘టీకా రికార్డు సృష్టించబడింది. ఒక కోటి మార్కును దాటడం పెద్ద విజయం. టీకా వేసిన వారందరికీ, టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ అభినందనలు’ అని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.