జాతీయం ముఖ్యాంశాలు

80% జనాభాకు ఫస్ట్‌ డోస్‌

  • వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రాష్ట్రం బెస్ట్‌
  • వచ్చేనెల చివరకు నిర్దేశిత లక్ష్యం చేరిక
  • ప్రపంచవ్యాప్తంగా దిగువ స్థానంలో భారత్‌
  • 33 శాతం వ్యాక్సినేషన్‌తో 110వ స్థానం
  • వేగం పెంచాలంటున్న వైద్య నిపుణులు
  • ‘గుడ్‌మార్నింగ్‌ సర్‌.. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు. వ్యాక్సిన్‌ ఎంతమంది తీసుకున్నారు. రెండు డోసులు పూర్తయ్యాయా? లేదా? అయితే ఫలానా ప్రాంతానికి రండి’ హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఆరోగ్య కార్యకర్త విజ్ఞప్తి.
  • ‘నగర ప్రజలకు విజ్ఞప్తి. రండి.. అర్హతలున్నోళ్లు వ్యాక్సిన్‌ తీసుకోండి..’ నగరంలోని ఓ ప్రధాన రోడ్డు పక్కన మొబైల్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ వద్ద ప్రచారం..
  • ఒకటి కాదు.. రెండు.. ఉన్న ప్రతి అవకాశాన్ని తెలంగాణ సర్కారు సద్వినియోగం చేసుకుంటున్నది. అందుకే నిర్దేశిత లక్ష్యంలో అప్పుడే 80 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్‌ తొలి డోసు పూర్తిచేసింది. వచ్చే నెలాఖరునాటికి వందశాతం మందికి మొదటి డోసు వేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే ఉత్తమంగా నిలుస్తున్నది.
  • రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ నిర్దేశిత లక్ష్యం: 2.20 కోట్ల మందికి
  • తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారు: 1.74 కోట్ల మందికి

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. రాష్ట్రంలో తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిసంఖ్య 1.74 కోట్లకు చేరుకున్నది. మొత్తం 2.20 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్దేశించగా.. దాదాపు 80 శాతం పూర్తయింది. దేశంలో అతి కొద్ది రాష్ట్రాల్లోనే 80 శాతం తొలిడోసును పూర్తిచేశాయి. రెండో డోసు విషయంలో తెలంగాణ ఇప్పటివరకు 20 శాతం అర్హులకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేసింది. దేశంలోనే తొలిసారిగా సూపర్‌ స్ప్రెడర్స్‌ క్యాటగిరీని గుర్తించి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. జీహెచ్‌ఎంసీలో సెప్టెంబర్‌ 9నాటికి వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిన కాలనీలు ఉన్న నగరంగా నిలిపేందుకు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్లు వేస్తున్నది.

వెనుకబడ్డ భారత్‌
వ్యాక్సినేషన్‌లో భారత్‌ వెనుకబడింది. జనాభా ఆధారంగా విశ్లేషణ ప్రకారం.. మన దేశంలో ఏదో ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కేవలం 33.6 శాతం. ప్రపంచ సగటు 33 శాతంతో ఇది దాదాపు సమానం. 217 దేశాల డాటాతో పోల్చితే భారత్‌ 110వ స్థానంలో నిలిచింది. యూఏఈ అత్యధికంగా 84.9 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్నది. దేశంలో వ్యాక్సినేషన్‌ వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వంద శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం
అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయడమే ప్రభుత్వ లక్ష్యం. తొలుత వ్యాక్సిన్‌ కొరత కారణంగా కొంత ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వమే విరివిగా ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తుండటంతో ప్రైవేటులో తక్కువగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటి వద్దకే వచ్చి వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం నడుస్తున్నది. ఇది పూర్తి కాగానే ఇతర ప్రధాన పట్టణాల్లోనూ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం. వ్యాక్సినేషన్‌లో ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాం. త్వరలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.

  • జీ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు