తలలు పగలగొట్టండంటూ పోలీసులకు అధికారి ఆదేశం
హర్యానా రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. దాదాపు 10 మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న అన్నదాతలు.. కర్నాల్‌లో శనివారం బీజేపీ సమావేశానికి వెళ్లకుండా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను అడ్డుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఘరౌండా టోల్‌ప్లాజా వద్ద రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నియంత్రణ కోల్పోయిన పోలీసులు రైతులపై లాఠీ ఝుళిపించారు. కర్నాల్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేటు అయుష్ సిన్హా.. ‘రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యారికేడ్లు దాటొద్దు. అవసరమైతే వారి తలలు పగులగొట్టండి’ అని పోలీసులను ఆదేశిస్తున్న వీడియో వైరల్ అయింది. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు లాఠీచార్జి చేశారని రైతు నాయకుడు దర్శన్‌పాల్ చెప్పారు. అన్నదాతలపై లాఠీచార్జిని నిరసిస్తూ హర్యానాలోని అన్ని హైవేలను, టోల్‌ప్లాజాలను దిగ్బంధించాలని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.