జాతీయం

Rajnath singh | ఆఫ్ఘన్‌లో పరిస్థితులు సవాల్‌గా మారాయి : రక్షణ మంత్రి

తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు పెను సవాలుగా మారాయని, ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో రక్షణ మంత్రి ఆదివారం మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులే భారత్‌ వ్యూహాన్ని మార్చాయన్నారు. ప్రస్తుతం భారత్‌ ఆఫ్ఘన్‌పై పురాలోచిస్తుందని, కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

అవసరమైతే అక్కడి గడ్డపైకి వెళ్లి సైనిక ఆపరేషన్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శత్రువులను నిర్మూలించేందుకు, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంటిగ్రేటెడ్‌ బాటిల్‌ గ్రూప్‌ ఏర్పాటును రక్షణ మంత్రిత్వశాఖ వేగంగా పరిశీలిస్తోందన్నారు. ఎందుకంటే.. యుద్ధ సమయాల్లో ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ముఖ్యమని, ఈ యుద్ధ బృందాలు వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. యుద్ధ విభాగాలను సైతం సిద్ధం చేస్తాయని, శత్రువులను నిర్మూలిస్తాయన్నారు.

టూర్‌ ఆఫ్‌ డ్యూటీ

భారత యువత సైనికుల్లా దేశభక్తిని, క్రమశిక్షణను నేర్చుకోవాలనేది మా ప్రయత్నమని రక్షణ మంత్రి అన్నారు. ఇందుకు కొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. దీని కోసం రక్షణ మంత్రిత్వశాఖ టూర్‌ ఆఫ్‌ డ్యూటీని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం గేమ్‌ ఛేజింగ్‌గా ఉంటుందని, అలాగే భారత సైన్యం సగటు వయసును కూడా తగ్గిస్తుందని భావిస్తున్నట్లు రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి పాక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ మారినందున పాక్‌ మౌనంగా ఉంటోందన్నారు. రెండు యుద్ధాల్లో ఓడిపోయిన తర్వాత పాక్‌ భారత్‌పై ఉగ్రవాదానికి పాల్పడడం ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదులకు ఆయుధాలు ఇవ్వడంతో పాటు శిక్షణ ఇస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం భారత్‌-పాక్‌ మధ్య సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొందని, భారత్‌ రక్షణాత్మక వైఖరిని వీడి ప్రతిస్పందించడం ప్రారంభించిందని పాక్‌కు తెలుసన్నారు. 2016లో బాలాకోట్ దాడులతో ఈ విషయం ప్రపంచానికి తెలిసివచ్చిందన్నారు.