తెలంగాణ

సీఎం కేసీఆర్‌తోనే దేవాదుల పూర్తి : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ జల ప్రదాత కేసీఆర్‌ కృషితోనే దేవాదుల ప్రాజెక్టు పూర్తవుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సాగునీటి అవసరాలకు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు కేటాయించారని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ప్రతి చెరువు నిండేలా, ప్రతి ఎకరం పండేలా సీఎం కేసీఆర్‌ పట్టుదలతో పని చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రాజెక్టు చివరి దశ పనులు వేగంగా పూర్తవుతున్నాయన్నారు.

ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ఆయన మంత్రి సత్యవతిరాథోడ్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి దేవాదుల ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. దేవాదుల సాగునీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పారు.

నియోజకవర్గాలు, గ్రామాల వారీగా దేవాదుల ప్రాజెక్టు నీరు వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. యాసంగి సీజన్‌ మొదలయ్యేలోపు అన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కొన్ని చోట్ల భూసేకరణ సమస్యలు, యూటీల నిర్మాణం వంటివి చేపట్టాల్సి ఉందని అన్నారు.