తెలంగాణ ముఖ్యాంశాలు

Telugu Language Day | సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలుగు భాష వికాసం : ఎంపీ సంతోష్‌

సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ అన్నారు. ఆదివారం తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గురించి, ఆయనకున్న సాహితీ సంపద గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘వేల పుస్తకాలు ఔపోసన పట్టిన ఘన వ్యక్తిత్వం, తెలుగు భాష పట్ల అనన్యసామాన్యమైన ప్రేమ, వెరసి మా పెదనాన్న, మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. వీరి సారధ్యంలో తెలుగు భాష మరింతంగా వికసిస్తుందనడంలో సందేహం లేదు’ అని ట్వీట్‌ చేశారు.

Telugu Language Day | సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలుగు భాష వికాసం : ఎంపీ సంతోష్‌

రాజకీయ రంగంలోనే కాదు సాహితీరంగంలోనూ తనకంటూ ప్రత్యేకతను సాధించిన సీఎం కేసీఆర్‌. ఓ వైపు పాలనలో నిత్యం బిజీగా ఉంటూనే.. వీలు దొరికినప్పుడల్లా తెలుగు కవిత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటారని, ఆ సాహితీ సౌరభాలను తను ఆస్వాదిస్తూనే నలుగురికి పంచుతుంటారన్నారు. ఓ చేత్తో కత్తిని మరో చేతితో కలాన్ని పట్టిన గతకాలపు చక్రవర్తులకు ప్రతీక సీఎం కేసీఆర్ అన్నారు. ఎంత సమర్థవంతంగా పాలన నిర్వహిస్తారో.. అంతే సమర్థంగా సాహితీ సమావేశాలను రక్తి కట్టిస్తారని చెప్పారు. స్వరాష్ట్ర సాధన కోసం స్వయంగా పాటలు రాసిన ఘనత ఆయన సొంతమని, సీఎం కేసీఆర్‌కు పాటలే కాదు పద్యాలన్నా మక్కువ ఎక్కువ అన్నారు.

ఎలాంటి కఠిన పదాలు కలిగిన పద్యాన్నైనా అవలీలగా పాడుతారని, తెలుగు ప్రపంచ మహాసభల్లో సీఎం కేసీఆర్ పాడిన పద్యాలు పండితుల నుంచి పామరుల దాకా అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పారు. రాజకీయం అంటే ఎంతసేపూ వ్యూహ ప్రతివ్యూహాలే కాదు గ్రంధ ప్రబంధాల పఠనం కూడా అని నిరూపించే అతి కొద్ది నాయకుల్లో కేసీఆర్ ఒకరని, అమితమైన ప్రజాకర్షణ, వాగ్ధాటి, వాక్షుద్ధి, మధ్య మధ్య చెణకులు, ఛలోక్తులు, సామెతలు, జాతీయాలు వెరసి ఇంకాసేపు మాట్లాడితే బాగుండు.. అనే శైలి సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. పద్యమైనా, గద్యమైనా.. ప్రబంధమైనా.. సీఎం కేసీఆర్ పదకోశం.. ఒక సాహితీ సంద్రమని, సరస్వతీ దేవిని చూడగానే.. ఒక సాహిత్యాభిమానిగా అవధులు లేని ఆనందాన్ని ప్రకటించడం ఆయనకే సొంతమన్నారు.