తెలంగాణ

కామారెడ్డి జిల్లా సంఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్

కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో గల బీర్మల్‌ గిరిజన తండాకు చెందిన ఓ బాలిక శిశువుకు జన్మనిచ్చి ఆత్మహత్య  చేసుకున్న ఘటనపై గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులను పట్టుకుని చట్టపర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి సంతాపం తెలిపారు.

ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అని ధీమా కల్పించారు. మంత్రి ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆనంతరం శిశువును హాస్పిటల్ లో చేర్పించి పర్యవేక్షిస్తున్నామని, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే దోషులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తామన్నారు.

కామారెడ్డి జిల్లా సంఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్

మ‌గ శిశువుకు జ‌న్మనిచ్చిన మైన‌ర్.. ఆపై ఆత్మహత్య..

ఓ మైన‌ర్ మ‌గ శిశువుకు జ‌న్మనిచ్చి.. ఆ త‌ర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా గాంధారి మండ‌లం బీర్మల్‌ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఓ బాలిక గ‌ర్భం ధ‌రించింది. కానీ ఈ విష‌యం ఇంట్లో ఎవ‌రికీ తెలియ‌దు. నెల‌లు నిండడంతో ఆ బాలిక మంగ‌ళ‌వారం రాత్రి పండంటి మ‌గ‌బిడ్డకు జన్మనిచ్చింది. ఏం చేయాలో తెలియ‌క ఆమె.. శిశువును చెట్ల పొద‌ల్లో వ‌దిలేసి.. తండాకు స‌మీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది.

ప‌సిపాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థలికి చేరుకున్న ఐసీడీఎస్ సిబ్బంది.. శిశువును కామారెడ్డి ఏరియా దవాఖానకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.