2001లో ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం.. ఈ 20 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ నగరం నడిబొడ్డుకు చేరింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం గర్వంగా ఉందని, ఆ భవనం తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నం అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఈ రోజు శాశ్వతంగా నిలిచిపోతోందని ఆయన అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ సర్ మాటలాగ, ఇవాళ తెలంగాణ గులాబీ పతాకం ఢిల్లీ గడ్డ మీద రెపరెపలాడటం ప్రతి తెలంగాణ బిడ్డ ఒక గొప్ప భరోసాను ఇస్తుందని కేటీఆర్ అన్నారు. దక్షిణ భారత దేశం నుండి ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో ఒక కార్యాలయం స్థాపించడం ఇది రెండవది కావడం టీఆర్ఎస్ శ్రేణులకు గర్వకారణని, ఈ సందర్భంగా పార్టీ కోసం అనునిత్యం పాటుపడుతున్న పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్, కేటీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భూమి పూజ కార్యక్రమం ఓ పండుగలా కొనసాగింది.