రాగల 3 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. నగరంతో పాటు మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. మలక్‌పేటలో ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. అంబర్‌పేట వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. నగరంతో పాటు ఆయా జిల్లాల్లో కూడా వర్షం దంచికొట్టింది. పలు చోట్ల పిడుగులు పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.