ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )కు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని.. తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్రుల్లా సలేహ్.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఓ లేఖ రాశారు. ఆఫ్ఘన్‌లో ఇప్పటికీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లకుండా పోరాడుతున్న పంజ్‌షిర్‌లో మారణహోమం జరగబోతోందని, దయచేసి దీనిని ఆపాలంటూ ఆయన వేడుకున్నారు. ఈ మేరకు తాను రాసిన లేఖను ఆదివారం ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అక్కడ మానవతావాద విపత్తు సంభవించబోతోందని అమ్రుల్లా అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితితోపాటు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలు వేగంగా స్పందించాలని కోరారు.
కాబూల్‌తోపాటు దేశంలోని ఇతర నగరాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత మహిళలు, వృద్ధులు, పిల్లలు సహా సుమారు రెండున్నర లక్షల మంది పంజ్‌షిర్ లోయల్లో తలదాచుకుంటున్నారు. ఒకవేళ వీళ్లను వెంటనే కాపాడలేకపోతే అక్కడ ఓ పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన, మానవతావాద విపత్తు సంభవించే ప్రమాదం ఉంది. ఆకలికేకలతో చనిపోవడంతోపాటు పెద్ద ఎత్తున మారణహోమం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని తన లేఖలో అమ్రుల్లా రాశారు.
రెండు దశాబ్దాల ఘర్షణలు, ప్రకృతి విపత్తులు, రోగాలు, కొవిడ్-19 మహమ్మారి, తిరిగి దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద మానవతావాద సంక్షోభం ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్నది అని కూడా అమ్రుల్లా అన్నారు. 30 లక్షల మంది దేశంలో చెల్లాచెదురయ్యారు. కోటి 80 లక్షల మంది ఆహారం కోసం, మనుగడ కోసం పోరాడుతున్నారు. పంజ్‌షిర్ ప్రావిన్స్‌లో తాలిబన్ల ఊచకోతను ఆపాలని యూఎన్‌ను వేడుకుంటున్నాను అని అమ్రుల్లా అన్నారు.