మండల కేంద్రంలో రైతుబంధు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన విమర్శలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తనను తిట్టడం కాదు.. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఈ ప్రభుత్వం ఏయే సహాయం చేసిందో రైతుల దగ్గరే రైతుబంధు సభ్యులు చర్చ పెట్టాలని సూచించారు. రైతులను ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు తప్ప ఎవరికీ లేదన్నారు. కాంగ్రెస్ ఇక్కడ లేనే లేదని.. వాళ్లకు డిపాజిట్ కూడా రాదన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు, మోటర్ల కాల్చివేత, ట్రాన్స్ ఫార్మర్లు పేలడం, పొలాలు ఎండడం, ఎరువుల కోసం చెప్పులతో బారులు తీరడం అని గుర్తు చేశారు. బీజేపీ తెచ్చిన రైతు చట్టాలు.. నల్లచట్టాలని గతంలో ఈటల రాజేందరే అన్నాడని చెప్పారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతానని అన్నాడని, మరి ఇప్పుడు అమిత్ షా, మోడీ.. ఈటల రాజేందర్ చెవిలో ఈ చట్టాలను రద్దు చేస్తానని చెప్పారా? అని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయించిన తర్వాతే హుజురాబాద్ రైతులను ఓట్లు అడగాలన్నారు. రోజుకో కేంద్ర మంత్రిని తెచ్చి మాట్లాడిస్తున్న ఈటల.. నేను ఇక్కడికి వస్తే విమర్శిస్తున్నాడని, కేరళ నుంచి మురళీధరన్ వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు కానీ.. నేను ఈ రాష్ట్ర మంత్రిగా, ఉద్యమకారుడిగా ఇక్కడికి వస్తే తప్పా? అని ప్రశ్నించారు.
నేనంటే ఎందుకంత భయం?
‘నేనంటే ఎందుకంత భయం రాజేందర్ గారు.. నేనమన్న అంటినా, నేనేమన్నా చేస్తినా.. నామీద ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. నేనట రాత్రి పూట ఇండ్లలోకి తిరుగుతున్నానట.. నాకు అంత అవసరముందా? ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హర్యానాలో ఉన్న బండారు దత్తాత్రేయ, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, సంజయ్ లాంటి వాళ్లంతా నీ తరపున ప్రచారం చేస్తే తప్పు లేదు గానీ.. నేనొస్తే తప్పా.. రాష్ట్ర బీజేపీ అంతా ఇక్కడ ప్రచారం చేస్తుంటే.. నెనొక్క మంత్రిని వస్తే తప్పా నేనేమని చెప్పాను.. కేవలం కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరిస్తున్నారని నిజం చెప్తే ఎందుకు ఆగమవుతున్నావ్? ’ అన్నారు.
తాను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందా? డీజిల్, పెట్రోల్ ధరలు పెరగలేదా? ఒక్క ఏడాదిలో ట్రాక్టర్ దున్నే కూలీ రూ.3వేలు పెరగలేదా? అంటూ ప్రశ్నించారు. అలాంటి పార్టీలోకి ఈటల రాజేందర్ ఎందుకు పోయినట్లు? నల్ల చట్టాలపై ఆనాడు మాట్లాడింది తప్పని ఈటల చెంపలు వేసుకోవాలి? లేదంటే నల్ల చట్టాలు రద్దు చేయించి.. పెరిగిన ధరలు డిమాండ్ చేశారు. ఏమని చెప్పి హుజురాబాద్ రైతుల ఓట్లను ఈటల ఓట్లు అడుగుతారన్నారు. కాళేశ్వరం నీళ్ల తూము దగ్గరుంది హుజురాబాదేనని, తూము లేపితే.. తొలి చుక్క అందేది ఈ ప్రాంతానికేనన్నారు. గతంలో హుజురాబాద్‌లో నీళ్ల కోసం కొట్లాటలు జరిగేవి.. ఈ సారి వేసవిలో నీరు ఎక్కువై.. చాలు బంద్ చేయమని అంటున్నారనన్నారు.
రైతుకు ఐదు లక్షల బీమా ఇచ్చిన ప్రభుత్వముందా?
ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఐదు లక్షల బీమా రైతులకు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అంటూ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ వస్తే తెలంగాణ చీకటి అవుతుందని కిరణ్ కుమార్‌రెడ్డి కట్టె పట్టుకు బెదిరిస్తే.. 9 నెలల్లో కేసీఆర్ కరెంట్ తెచ్చి చూపించారని, 24 గంటల కరెంట్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటానని అప్పట్లో జానారెడ్డి అన్నాడని గుర్తు చేశారు. హర్యానాలో, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మీరే ఉన్నారు కదా.. అక్కడ ఉచిత కరెంట్ ఇస్తున్నారా? నీటి తీరువా రద్దు చేశామా? లేదా? గతంలో నీటి తీరువా, భూమి శిస్తు వసూలు చేసేవారు.
పన్నులన్నీ రద్దు చేసి రైతుకే ఎదురు ఏడాదికి పదివేలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అన్నారు. టీఆర్ఎస్ ఇన్ని పనులు చేస్తుంటే.. బీజేపీ ఏమని చెప్పి ఓట్లడుగుతారు. యాసంగిలో దొడ్డు వడ్లు వేయద్దు, దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం తెలంగాణకు లేఖ రాసిందని, సన్న వడ్లు కొనమని, దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చెబుతుంటే ఆ విషయం అడగక.. ఈటల రాజేందర్ తననెందుకు తిడుతున్నారంటూ ప్రశ్నించారు. ‘నన్ను తిడితే నీకేమొస్తుంది రాజేందర్ గారు.. నీకు ఓట్లు కావాలంటే హరీశ్ రావును తిట్టడం కాదు.. ఢిల్లీకి పోయి దొడ్డు వడ్లు కొంటామని ఒప్పించు. రైతు చట్టాలు వాపస్ తీసుకుంటామని ప్రధాన మంత్రితో చెప్పించు. ఆ పని చేయక నన్నెందుకు తిడుతున్నాడెందుకు ఊకే.
బీజేపీకి ఓటేయడమంటే మన కన్నును మన వేలితో పొడుచుకోవడమే. బీజేపీకి ఓటేయడమంటే డీజిల్ ధరల పెంపును ఒప్పుకున్నట్లే, మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించినట్లే. ఎన్నో హేళనలను తట్టుకుని తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణను బీజేపీ చేతిలో పెట్టి రైతుల బతుకులు ఆగం చేద్దామా? ’ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని, ఆ పార్టీకి రైతులు ఓటేస్తారా? సిలిండర్ ధర రూ.వెయ్యి చేశారు కాబట్టి మహిళలు ఓట్లేస్తారా? ఉద్యోగులు, పింఛన్‌దారులకు సీఎం 30శాతం ఫిట్ మెంట్ ఇస్తే, కేంద్రం 7.5 శాతం పెంచిందని.. వాళ్లు కూడా ఓటేయరని, బీజేపీ. కార్మికుల శ్రమను దోచుకునే చట్టాలు తెస్తోందని, వాళ్లు కూడా ఓటేయరు. దళితులైతే.. వాళ్లను వాకిట్లకే రానీయరు.. ఇక వాళ్లకు ఓటేసే వర్గం ఎక్కడుంది? అన్ని ప్రశ్నించారు.
బీసీలకు ప్రత్యేక శాఖ అడిగితే.. డిజిన్విస్ట్‌మెంట్ శాఖ తెచ్చిన్రు
బీసీలకు ప్రత్యేక శాఖ పెట్టాలని కోరితే.. పెట్టకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే డిజిన్విస్ట్ మెంట్ శాఖను పెట్టారన్నారు. ఈ శాఖ అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఊడగొడుతుందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు అని చెప్పారని, కానీ చిన్న నోట్లు రద్దు చేసిందని.. వెయ్యి నోటు రద్దు చేసి.. 2వేల నోటుతెచ్చిందన్నారు. బీజేపీ హయాంలో ఏ వర్గం బాగుపడిందో చెప్పాలని, ఎందుకు వాళ్లకు ఓటేయాలి అంటూ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ దార్శనికతతో కాళేశ్వరం : కొప్పుల
రాష్ట్రం వ్యవసాయంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయని నాడు ఎవరూ అనుకోలేదని, సీఎం కేసీఆర్ దార్శనికతతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో రైతు సమన్వయ సమితులు కీలక పాత్ర పోషించాలన్నారు. క్షేత్రస్థాయిలో స్థాయిలో రైతులను చైతన్య పరచాలని సూచించారు. రైతులకు మేలు జరగాలంటే టీఆర్ఎస్, కేసీఆర్ ఉండాలన్నారు. ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించి.. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలతో వ్యవసాయం లాభసాటిగా కేసీఆర్ మార్చారని.. దేశంలో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కు నెట్టి తెలంగాణ వరి సాగులో తొలిస్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ చెబుతున్న పంట మార్పిడి పద్ధతి రైతులు అవలంబిస్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్నారు.