మన దేశంలో బంగారం కొనుగోళ్లు అధికం. పండుగలు, శుభకార్యాల వేళల్లో పసిడి అంగళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమ మార్గంలో బంగారు విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
పోలీసుల అదుపులో ముఠా..
విజయవాడలో కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురు వ్యక్తులను విచారణ నిమిత్తం శనివారం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. టాస్క్‌ఫోర్స్, విజలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం.
►2018 నుంచి నగరంలో ఈ ముఠా బంగారాన్ని అనధికారికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
► విజయవాడ నగరానికి చెందిన వెంకటేశ్వరరావు, పీఎస్ నాగమణిలు ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని, రైల్వే స్క్వాడ్ ఆకుల వెంకట రాఘవేంద్రరావు పైనా ఆరోపణలుండటంతో ముగ్గురినీ విచారిస్తున్నట్లు సమాచారం.
► 100 గ్రాముల బంగారం బిస్కెట్‌లను వాయు, జల మార్గాల ద్వారా నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.5 లక్షల ఖరీదు చేసే బిస్కెట్‌ను వీరు రూ.4 లక్షలకు విక్రయిస్తున్నారు.
► ఈ నేపథ్యంలో వీరి వ్యాపారం జోరందుకోవడంతో పలువురు బంగారం కోసం వీరికి నగదు చెల్లించారు. నగదు చెల్లించిన 20 నుంచి 30 రోజుల వ్యవధిలో వీరు బిస్కెట్‌లను ఇస్తారని సమాచారం.
ఎలా బయటకొచ్చిందంటే..
అయితే నాలుగు నెలల క్రితం నగదు తీసుకుని ఇప్పటి వరకు బిస్కెట్‌లు ఇవ్వకపోవడంతో మూడు రోజుల క్రితం నాగమణితో కొందరు వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదాన్ని కిడ్నాప్‌గా మార్చుకుని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఇద్దరు వ్యక్తులను పిలిచి విచారించడంతో బంగారం స్మగ్లింగ్ అంశం తెరమీదకొచ్చింది.
సౌదీ టు విజయవాడ వయా సింగపూర్..
బంగారం ఉత్పత్తి కేంద్రమైన సౌదీలోని ఖతర్ నుంచే స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్‌కు, అక్కడ నుంచి విజయవాడకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్‌లు తీసుకొస్తున్నట్లు సమాచారం.
2018లోనే బీజం..!
► అయితే 2018లో సౌదీలోని ఖతార్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌తోనే ఈ స్మగ్లింగ్‌కు పునాది పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
►రైల్వే స్క్వాడ్ విధులతో పాటు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న ఆకుల వెంకట రాఘవేంద్రరావు ఆ గేమ్స్‌కు ఇండియన్ టీమ్ మేనేజర్‌గా వెళ్లారు.
►అప్పట్లోనే అక్కడున్న కొందరు స్మగ్లర్‌లతో పరిచయాలు పెంచుకుని బంగారం బిస్కెట్‌ల అక్ర మ వ్యాపారాన్ని నగరంలో విస్తరించారని నగరంలోని పలు క్రీడా వర్గాలు చెప్పుకుంటున్నాయి.
► రాఘవేంద్రరావు గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వైనం క్రీడా సంఘాల నాయకుల మధ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రైల్వే, దుర్గగుడి ఉద్యోగులే బాధితులు..
రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్‌ల(టీసీలు)తో పాటు, బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగులే ఎక్కువమంది బంగారం బిస్కెట్‌ల కోసం ముఠా సభ్యులకు సొమ్ము చెల్లించినట్టు సమాచారం. సుమారు 20 మంది రైల్వే టీసీలు రైల్వే స్క్వాడ్ ఆకుల వెంకట రాఘవేంద్రరావు ద్వారా ముఠాకు సుమారు రూ.6 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. నగదు చెల్లించిన వారిలో ఇద్దరు టీసీలపై ముఠా సభ్యురాలు నాగమణి పోలీసులకు తనను కిడ్నాప్ చేశారని ఇటీవల ఫిర్యాదు చేసింది.
దుర్గగుడిలో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులు ముఠా సభ్యులకు సుమారు రూ.1.5 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారు. ముఠా సభ్యులకు చెల్లించిన నగదు బ్లాక్ మనీ కావడంతో లేనిపోని చిక్కులొస్తాయనే భావనతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదని సమాచారం. అయితే ఈ నెల 4న ఈ వ్యవహారంపై పత్రికల్లో వార్తలు రావడంతో పలువురు బాధితులు ఫోన్ చేసి వివరాలు చెబుతున్నారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.