జాతీయం

Rahul Gandhi : జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌గాంధీ (Rahul Gandhi) జమ్ముకశ్మీర్‌ చేరుకున్నారు. ఆయనకు జమ్ము విమానాశ్రయంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులపై రాహుల్‌ చర్చించనున్నారు. ఈ రోజు సాయంత్రం వైష్ణోదేవి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

గత నెలలో జమ్ముకశ్మీర్‌లో రెండు రోజులు పర్యటించిన రాహుల్‌గాంధీ.. మరోసారి జమ్ముకు వచ్చారు. ఈసారి కూడా రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా కాత్రా నుంచి సాయంత్రం కాలి నడకన వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారని జమ్ముకశ్మీర్‌ పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్‌ మీర్‌ తెలిపారు. పవిత్ర ఆలయాల పట్ల రాహుల్‌ గాంధీకి ఎంతో నమ్మకమున్నదని, అందుకే వైష్ణోదేవి ఆలయానికి కాలినడకన వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని చెప్పారు. అందుకే తొలిరోజున ఎలాంటి సమావేశాలు ఏర్పాటుచేయలేదన్నారు. శుక్రవారం కాత్రా నుంచి కారులో జమ్ముకు వెళ్లి అక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా, ఇదే సమయంలో లడఖ్‌లో కూడా పర్యటించేందుకు రాహుల్‌ ఆసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.