Corona 3rd Wave | కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెలలో గానీ దేశాన్ని థర్డ్ వేవ్ ముంచెత్తుతుందన్న ఆందోళన మధ్య ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆరోగ్య వ్యవస్థలు సర్వసన్నద్ధం కావాలన్నారు. మెడికల్ ఆక్సిజన్ లభ్యత, వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హితవు చెప్పారు. దేశంలో ఆరోగ్య పరిరక్షణ మౌలిక వసతులు అభివృద్ధి చెందిన తీరును వివరించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని దవాఖానల్లో బెడ్ల సామర్థ్యం, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, వసతుల పరిస్థితిని నరేంద్రమోదీ సమీక్షించారు. వివిధ రాష్ట్రాలకు దాదాపు లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మూడు లక్షల ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. తాజాగా వెలుగు చూస్తున్న కరోనా మ్యూటెంట్ల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులను హెచ్చరించారు.