తెలంగాణ ముఖ్యాంశాలు

ఖైరతాబాద్‌లో ఈ నెల 19 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ నగరం గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల శోభను సంతరించుకున్నది. ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతి కొలువయ్యాడు. ఈ భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలు భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గణేశ్‌ ఉత్సవాల దృష్ట్యా ఈనెల 19 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్‌లలో రావాలని సూచించారు. భక్తుల కోసం హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతిస్తున్నారు. వృద్ధులు, నడవలేనివారికి మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.