ఆంధ్రప్రదేశ్

26న ఆర్జీయూకేటీ సెట్‌–2021

రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం ఆర్జీయూకేటీ సెట్‌–2021ని ఈ నెల 26న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఏదైనా మండలం నుంచి 100 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే అదే మండలంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తక్కువ వస్తే సమీపంలోని మండల కేంద్రంలోని సెంటర్‌ను కేటాయిస్తామని వెల్లడించారు. తెలంగాణలో 8 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష ఫలితాలను అక్టోబర్‌ 4న విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 74,403 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

11 వరకు దరఖాస్తుకు అవకాశం 
ఆర్జీయూకేటీ సెట్‌–2021కి రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్‌ కన్వీనర్‌ హరినారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సవరణకు శనివారం (11వ తేదీ) వరకు అవకాశం కల్పించినట్టు చెప్పారు.