ఆంధ్రప్రదేశ్

నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం

సెంటు భూమిలేదు, ఉండేందుకు గూడూలేదు

నిష్కళంక, నిజాయితీ జీవితానికి ఆయనో రోల్‌మోడల్

సెంచరీ దాటిన ఆ మాజీ ఎమ్మెల్యే రూటే వేరు

104వ వసంతంలోకి పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌

కౌన్సిలర్‌ కాగానే మందీ మార్బలంతో హంగామా చేసే రాజకీయ నాయకులు మనకు నిత్యం ఎక్కడపడితే అక్కడ తారసపడుతుంటారు. కానీ, పాత తరానికి చెందిన కొందరు అతి సామాన్య జీవితం గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆ కోవకు చెందిన వారే పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధులు ఠానేదార్‌ చిన్నరాజన్‌. ఈయన పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, రాయలపేటలో 1918 సెప్టెంబర్‌ 11న తండ్రి అన్నయ్యగౌడుకు ఎనిమిదో సంతానంగా జన్మించారు. ఇతని భార్య బద్రాంభ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసి గతంలోనే మృతిచెందారు.( చదవండి: మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు)  

ఇతనికి నలుగురు సంతానం. 1967లో పలమనేరు ఎమ్మెల్యేగా స్వతంత్ర పార్టీ తరఫున గెలుపొందారు. ప్రజాసమస్యలపై శాసనసభలో మంచి వక్తగా పేరుంది. 1972లో ఎమ్మెల్యేలకు పింఛన్‌ ఇవ్వాలనే ప్రతిపాదనొస్తే సేవచేసే ఎమ్మెల్యేకెందుకయ్యా పింఛనంటూ తొలుత వ్యతిరేకించింది ఇతనే. ఈనెల 11న ఆ మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌ 104వ పుట్టినరోజు సందర్భంగా ఆయన విశిష్టతలు ఈ తరం వారి కోసం..

►పట్టణంలోని కొత్తపేటలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న ఆయనకు సెంటు భూమి లేదు. పైసా నిల్వలేదు. ఉండేందుకు సొంత గూడు కూడా లేదు. 
►మాజీ ఎమ్మెల్యేల కోటాలో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని వద్దంటూ నిరాకరించారు. 
►స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో సొంత నియోజకవర్గంలో ఇవ్వజూపిన భూమిని కూడా  వద్దన్నారు. 
►ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల పెంపు, దురాక్రమణలో ఉన్న ఆవులపల్లి అడవిని ప్రభుత్వపరం చేయించారు.
►సివిల్‌ సప్లయిస్‌ బెల్టు ఏరియా రద్దు తదితరాలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఆలోజింపచేసిన ఘనత ఆయనకే దక్కింది. 
►రాజకీయాలంటే కేవలం సేవేగాని సంపాదన కాదని.. నీతి, నిజాయితీలే ఆభరణాలనే సంకల్పంతో ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారు.