ఆంధ్రప్రదేశ్

AP News : వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

హెల్త్‌ హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే దవాఖానల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్‌ హబ్స్, దవాఖానల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..హెల్త్‌ హబ్స్‌ద్వారా ఏర్పాటయ్యే దవాఖానల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్న సీఎం
ఎవరు ఎక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌ హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలన్నారు.

హెల్త్‌హబ్స్‌ ద్వారా వచ్చే దవాఖానాల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌హబ్స్‌ ద్వారా నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.
అవయవ మార్పిడి చికిత్సలు చేసే హాస్పిటల్స్‌ ఏర్పాటుపై హెల్త్‌ హబ్స్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని స్పష్టంచేశారు.

లాభాపేక్షలేకుండా నిర్వహిస్తున్న దవాఖానలు, సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాగా, వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను అధికారులు సీఎంకు వివరించారు. బిల్డింగ్‌ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసులు, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను నిర్వహించనున్న అధికారులు, సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణస్థాయి బలోపేతంగా ఉండాలన్నారు. నిర్ణీత రోజులకు మించి ఎవరైనా సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌..


ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు సంబంధించి వివరాలను సీఎం కేసీఆర్‌కు అధికారులు అందజేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు ఉండాలన్నారు.
నవంబర్‌ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు
వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో అమలు చేయాలని సూచించారు. కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే కొవిడ్‌ కట్టడిపై కూడా అధికారులు నివేదిక అందజేశారు. థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత, వ్యాక్సినేషన్‌పై సీఎం చర్చించారు.

సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కొవిడ్‌ టాస్క్‌పోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జే వి యన్‌ సుబ్రహ్మణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.