ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. సీఎం జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సీబీఐ కోర్టు కొట్టివేసింది. గతంలో సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో విచారణ తర్వాత.. బెయిల్‌పై జగన్, సాయిరెడ్డి విడుదలయ్యారు. వీరిద్దరికి గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంలో విధించిన.. షరతుల్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది.
అయితే, గత నెలలోనే తీర్పు వెలువడాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా పడింది. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు బెయిల్ రద్దు పిటిషన్లను కొట్టి వేయడంతో వైసీపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. అయితే, తీర్పును వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ పైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను మరో కోర్టుకు బదిలీ చేయాలని.. అప్పటి వరకు తీర్పు ఇవ్వకుండా సీబీఐ కోర్టును నిలువరించాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పైనా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. అయితే, పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.