అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

‘టైమ్‌’ జాబితాలో మోదీ, మమత, పూనావాలా

తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు బరాదర్‌కూ చోటు
టైమ్‌ మ్యాగజైన్‌ రూపొందించిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితా-2021’లో ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలకు స్థానం లభించింది. ‘టైమ్‌’ బుధవారం విడుదలచేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లాహ్‌ అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ తదితరులు కూడా ఉన్నారు. ‘74 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ముగ్గురు శక్తిమంతమైన నాయకులు ఉన్నారు. వారు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ. నెహ్రూ, ఇందిర తర్వాత భారత రాజకీయాలను శాసిస్తున్నది మోదీయే’ అని ‘టైమ్‌’ పేర్కొంది. దేశాన్ని సెక్యులరిజం నుంచి హిందూ జాతీయవాదంవైపు మోదీ పురిగొల్పారని, దేశంలో ముస్లింల హక్కులను హరిస్తున్నారని, జర్నలిస్టులను భయపెడుతున్నారని, జైళ్లలో బంధిస్తున్నారని ఆరోపించింది. భారత రాజకీయాల్లో మమతా బెనర్జీని కాఠిన్యానికి మరో రూపంగా ‘టైమ్‌’ అభివర్ణించింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థకు పూనావాలా సారథ్యం వహిస్తున్నారని, కరోనాను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొంది.