వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. యూపీలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని, రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఉచిత విద్యుత్ హామీని నెరవేరుస్తామని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు.
పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌తో కలిసి సిసోడియా గురువారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. యూపీలో పాలక బీజేపీకి తాము దీటైన పోటీ ఇస్తామని రాష్ట్రంలో అన్ని స్ధానాల్లో తమ అభ్యర్ధులు బరిలో ఉంటారని ఆప్ ఇప్పటికే వెల్లడించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వందమంది అభ్యర్ధులతో కూడిన జాబితాను ఆప్ ప్రకటించిన మరుసటి రోజే ఉచిత విద్యుత్ హామీని ప్రకటించింది.