2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని నిలువరించేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీయే దీటైన నేత అని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. మోదీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎదగలేదని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ అన్నారు. కాంగ్రెస్ లేకుండా విపక్ష కూటమి గురించి తాము మాట్లాడటం లేదని, రాహుల్‌ను తాను చాలాకాలంగా గమనిస్తున్నానని, ఆయన ఇంకా మోదీకి ప్రత్యామ్నాయ నేతగా ఎదిగిరాలేదని బందోపాధ్యాయ్ పేర్కొన్నారు.
దేశమంతా మమతా నాయకత్వాన్ని కోరుకుంటోందని, అందుకే తాము దీదీని విపక్ష నేతగా తెరపైకి తీసుకువస్తామని చెప్పారు. మోదీని రాహుల్ ఓడించలేరని, కమ్యూనిస్టులు దేశంలో ప్రాబల్యం కోల్పోయారని అన్నారు. ఇటీవల ముగిసిన బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ విజయంతో మోదీని ఢీకొట్టే జాతీయ నేతగా దీదీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.