కేంద్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు అనంత్ గీతే వ్యాఖ్యలు మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. అనంత్ గీతే ఏం మాట్లాడారో తనకు తెలియదని, అయినా ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అనంత్ గీతే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పారు.
ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఒక పెద్ద నాయకుడని, మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో ఆయనే మూలస్తంభమని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాగా, సోమవారం ఓ సమావేశంలో అనంత్ గీతే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి ఎన్‌సీపీ పుట్టిందని విమర్శించారు. రెండు కాంగ్రెస్ పార్టీలే ఒక్కటి కానప్పుడు, శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటైనా.. మనం కూటమి సైనికులు కాబోమని, శివసైనికులమేనని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.