ప్రగతి భవన్‌లో ఆర్టీసీ, విద్యుత్ శాఖలపై సీఎం సమీక్ష
చార్జీలు పెంచకుంటే మనుగడ లేదన్న ఆయా శాఖల మంత్రులు
తెలంగాణలో త్వరలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని, దారి చూపాల్సిందేనని ఆయా శాఖల మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం.. వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్‌లో నిన్న ఆర్టీసీ, విద్యుత్ శాఖలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సీఎస్ సోమేశ్‌కుమార్, రవాణా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కరోనా దెబ్బకుతోడు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ఈ సందర్భంగా సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల రూ.550 కోట్లు, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరలు పెరగడం వల్ల రూ. 50 కోట్లు కలిసి ఏడాదికి దాదాపు రూ. 600 కోట్ల మేర భారం పడుతోందని, కాబట్టి ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిందేనని మంత్రులు అజయ్ కుమార్, జగదీశ్‌రెడ్డి, సజ్జనార్, ప్రభాకర్‌రావు తదితరులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ కారణంగానే ఆర్టీసీ దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు నష్టపోయిందని, ఒక్క హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ. 90 కోట్ల మేర నష్టం వస్తోందని తెలిపారు. కాబట్టి ఇప్పుడు చార్జీలు పెంచకుంటే మరింత భారం మోయాల్సి వస్తుందన్నారు. చార్జీలు పెంచుతామని గతేడాది మార్చిలోనే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే తప్ప ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదని అజయ్ కుమార్, సజ్జనార్ తెలిపారు.
అలాగే, విద్యుత్ చార్జీలను ఆరేళ్లుగా సవరించలేదని, దీనికి తోడు కరోనా కాలంలో విద్యుత్ సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని, కాబట్టి ఇప్పుడు పెంచకతప్పదని మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభాకర్ రావు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ రెండు సంస్థల చార్జీలను పెంచేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై వచ్చే మంత్రిమండలిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనను రూపొందించాలని విద్యుత్, రవాణా మంత్రులు, అధికారులను ఆదేశించారు. కాగా, తెలంగాణలో చివరిసారిగా డిసెంబరు 2019 లో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఈసారి కూడా 10 నుంచి 20 శాతం మేర చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. 20 శాతం పెంచితే కనుక రోజుకు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.