న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని, ఆయన కలం ఆగకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఆకాంక్షించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకాన్ని మంగళగిరిలో గురువారం సీజే గోస్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీజే అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. ఇటీవల జస్టిస్ శివశంకర్ తనను పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానించారన్నారు. ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకానికి తొలి పాఠకుడిని తానేనని చెప్పారు. న్యాయవ్యవస్థలోని వివిధ అంశాలను వివరణాత్మకంగా ఈ పుస్తకం ద్వారా అందించారన్నారు.
శివశంకర్ పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. ఓ మంచి పుస్తకం పది మంది స్నేహితులతో సమానమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి తెలిపారు. ఈ పుస్తకం న్యాయవాద వృత్తిలోకి వచ్చే భవిష్యత్ తరాలకు టార్చ్‌బేరర్ వంటిది అన్నారు. శివశంకర్, తాను ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందినవారమేనని పేర్కొన్నారు. శివశంకర్ రాసిన వర్డ్స్, ప్రిన్సిపిల్స్, ప్రెసిడెంట్స్ పుస్తకం న్యాయవాదులతోపాటు, న్యాయమూర్తులకు కూడా ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఆయన గతంలో రాసిన పుస్తకాలు న్యాయ వ్యవస్థపై సమాచారంతోపాటు జ్ఞానాన్ని అందించాయని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జొయ్‌మాల్య బాగ్చి, దుర్గాప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.