జాతీయం

‘ప్రత్యేక హోదా కోసం.. కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం’

ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి అడిగి విసిగిపోయామని బీహార్‌ ప్రభుత్వం తెలిపింది. అందుకే ప్రత్యేక హోదాకు బదులు అన్ని రంగాల్లో ప్రత్యేక ప్యాకేజీలను డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల థింక్ ట్యాంక్ 2020-21 నివేదికను నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సూచిక (SDG) ర్యాంకులో బీహార్‌ దిగువన ఉన్నట్లు పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్రం నుండి ప్రత్యేక సహాయం అవసరమని తెలిపింది.

కాగా, బీహార్‌ రాష్ట్ర ప్రణాళిక మంత్రి బిజేంద్ర యాదవ్ నీతి ఆయోగ్‌ ర్యాంకుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పురోగతిని అంచనా వేసే విధానాన్ని మార్చమని నీతి ఆయోగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ‘గత సంవత్సరంతో పోలిస్తే SDG సూచీలో రాష్ట్రం 15 అంశాల్లో పదింటిలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. రాష్ట్రం, దాని సహజ పరిమితుల కారణంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతోంది. దీని కోసం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అవసరం’ అని మంత్రి చెప్పారు. స్పెషల్‌ స్టేటస్‌ డిమాండ్‌ను అడిగి అడిగి అలసిపోయామని, అందుకే ఈ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం వదులుకుందని తెలిపారు. ప్రత్యేక హాదాకు బదులు అన్ని రంగాల్లో ప్రత్యేక ప్యాకేజీలను డిమాండ్‌ చేస్తామని వెల్లడించారు.

కాగా, బీహార్‌లోని అధికార జేడీయూ 2012 నుంచి ప్రత్యేక హాదాను డిమాండ్‌ చేస్తున్నది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ప్రధాన రాజకీయ అజెండాలో ఇది కూడా ఒకటి. ప్రత్యేక హాదా కోసం గతంలో పలు ఏకగ్రీవ తీర్మానాలను కూడా చేసింది. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో విసిగి పోయిన సీఎం నితీశ్‌ కుమార్‌ సర్కార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను విరమించుకున్నది. ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజీలపై దృష్టి సారించింది.