AP CM YS Jagan On Endowments | టీటీడీలో మాదిరిగా ఇతర దేవాలయాల్లోనూ భక్తులకు ఆన్‌లైన్‌లో సేవలతోపాటు నాణ్యమైన లడ్డూ ప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన దేవాదాయ శాఖ పనితీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని, తద్వారా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి దాతలు ఇచ్చే విరాళాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని, డిస్‌ప్లే బోర్డులపై ప్రదర్శించాలన్నారు. దేవాలయాల అభివృద్ధికి దాతలు ఇచ్చే విరాళాలను ఇతర అవసరాలకు మళ్లించొద్దని హితవు చెప్పారు.
ఆ ఆదాయంతోనే ఆయా దేవాలయాల నిర్వహణ
ఆయా దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని వాటి నిర్వహణకు ఖర్చు చేయాలని, అవినీతికి తావివ్వద్దని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. తొలిసారి విజయవాడలోని కనకదుర్గ ఆలయ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అన్ని దేవాలయాల వద్ద మెరుగైన వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన లడ్డూ ప్రసాదం పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
తిరుమలలో వలే ఇతర దేవాలయాల్లోనూ లడ్డూ తయారీ
తిరుమలలో మాదిరిగా ఇతర దేవాలయాల్లోనూ లడ్డూల తయారీ ప్రక్రియను చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దేవాలయాల్లో సేవల పర్యవేక్షణకు కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని చెప్పారు. శ్రీశైలంతోపాటు రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. టీటీడీలో నిర్వహణా పద్దతులు, నాణ్యమైన ప్రమాణాలను పాటించేలా అన్ని దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులకు అవగాహన కల్పించడానికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.