ఢిల్లీ అల్లర్లు పక్కా ప్రణాళిక ప్రకారమే అప్పటికప్పుడు జరిగినవి కాదు.. హైకోర్టు
ఢిల్లీ అల్లర్లు ఏదో అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, అన్ని విషయాలను బేరీజు వేసుకుని పక్కా ప్రణాళిక ప్రకారమే అల్లర్లకు పాల్పడ్డారని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఏదో సంఘటన ఆధారంగా అప్పటికప్పుడు జరిగిన అల్లర్లు కావని స్పష్టం చేసింది.
సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో ఓ వర్గం వారు అల్లర్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆప్ కార్పొరేటర్ రెచ్చగొట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఓ పోలీస్ అధికారిని హత్య చేసి డ్రైనేజీ కాల్వలో పడేశారు. ఈ అల్లర్లపై హైకోర్టులో విచారణ నడుస్తోంది.
ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేందుకు, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టించేందుకు ఆందోళనకారులు కావాలనే అల్లర్లకు పాల్పడినట్టు ప్రాసిక్యూషన్ సమర్పించిన వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోందని న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. పద్ధతి ప్రకారం సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడమూ దానికి అద్దం పడుతోందన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కావాలని అల్లర్లకు పాల్పడినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
వందలాది మంది ఆందోళనకారులు కర్రలు, బ్యాట్లు చేతిలో బట్టుకుని తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులపై దాడులు చేశారని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది అరెస్టయిన ఇబ్రహీంకు బెయిల్ ను నిరాకరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని సమాజానికి చేటు చేయడం సరికాదన్నారు. కత్తులతో జనాన్ని ఇబ్రహీం బెదిరించినట్టు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయిందని అన్నారు. కాగా, హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ హత్య కేసులో ఇబ్రహీం నిందితుడిగా ఉన్నాడు.