వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రధానంగా విశాఖ, తూ.గో.జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గులాబ్ తుపాను ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మి.మీ. వర్షపాతం నమోదైంది.