తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణలో 10 లక్షల ఎకరాల పోడు సమస్య ఉంది : సీఎం కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ వర్షా‌కాల సమా‌వే‌శాలు శుక్ర‌వారం తిరిగి ప్రారంభమ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. గ్రామపంచాయతీ నిధులపై ప్రశ్నోత్తరాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘మన పంచాయతీలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మన గ్రామాలను చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయి.

పంచాయతీ గ్రాంట్‌లు ఆపొద్దని చాలాసార్లు చెప్పాను. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో ప్రతిపక్షాలకు తెలియదా?. కరోనా సమయంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపాం కానీ.. పంచాయతీలకు నిధులు ఆపలేదు. మన రాష్ట్ర సర్పంచ్‌లే గౌరవంగా బతుకుతున్నారు. నిధులు మళ్లింపు అనేది పూర్తిగా అవాస్తవం’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

గ్రామసర్పంచ్‌లు అద్భుతంగా పనిచేశారు: సీఎం కేసీఆర్‌
తెలంగాణ అసెంబ్లీ వర్షా‌కాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ హరిత హారంపై సభలో మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌లు అద్భుతంగా పనిచేశారని వారి సేవలను కొనియాడారు. గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలను అందంగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రభుత్వ కృషితో ప్రతీ గ్రామంలో పార్కులు ఏర్పాటయ్యాయని తెలిపారు. 526 మండల కేంద్రాల్లో రూరల్‌ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారని అన్నారు.

అదే విధంగా 35,700 ఎకరాల్లో అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గతంలో భయంకరమైన కరువులు, విపత్తులు చూశామని సీఎం కేసీఆర్‌ సమావేశంలో అన్నారు. మన దేశంలో చెట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని సభలో సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకే, చెట్ల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయని అన్నారు. ప్రపంచ దేశాల్లో కెనడాలోనే అత్యధికంగా మొక్కలు నాటారని అన్నారు. పచ్చదనంతో ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవచ్చని సీఎం కేసీఆర్‌ అన్నారు. మన కళ్ల ముందే అడవుల విధ్వసం జరిగిందని సభలో సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. హరితహారంలో ఇప్పటి వరకూ రూ.6556 కోట్ల ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 19,472 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని అన్నారు. 

తెలంగాణలో 10 లక్షల ఎకరాల వరకూ పోడు సమస్య ఉంది: సీఎం కేసీఆర్‌
రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల వరకూ పోడు సమస్య ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పోడు సమస్యపై ఇప్పటికే అనేక సార్లు అధికారులతో చర్చించామని తెలిపారు. గిరిజనులపై దాడులు చేయవద్దని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. కాగా,  ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూముల యాజమాన్య హక్కు మారదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.