తెలంగాణ

Chowmahalla Palace: ప్యాలెస్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?!

చౌ మొహల్లా ప్యాలెస్‌

నగర సిగలో నందివర్ధనం… చక్కటి అభిరుచికి దర్పణం… కళాత్మకతకు ప్రతిరూపం… సునిశితమైన పనితనానికి ప్రతీక… శాస్త్ర సాంకేతికతకు నిలువుటద్దం… అలనాటి హైదరాబాద్‌ వెలుగు వీచిక… చౌమొహల్లా ప్యాలెస్‌… ఇది నాలుగు ప్యాలెస్‌ల సమాహారం. వాటి పేర్లు అఫ్జల్, మెహ్‌తాబ్, ఆఫ్తాబ్, తెహ్‌నియత్‌ ప్యాలెస్‌లు. అయితే ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఈ నాలుగు ప్యాలెస్‌ల కంటే ముందు దర్బార్‌ హాల్‌ స్వాగతం పలుకుతుంది. దర్బార్‌ హాల్‌ దర్పాన్ని సాంతం వీక్షించాలంటే ప్రధాన ద్వారం దగ్గర కొద్ది క్షణాల సేపు నిలబడి చూడాలి.

దర్బార్‌ హాల్‌ ముందున్న నీటి కొలనుకు కుడి వైపు నుంచి మొదలు పెట్టి కనోపీ ట్రిమ్‌లో అందంగా కనిపిస్తున్న చింతచెట్టు ముందు నుంచి ప్రాంగణం మొత్తం ఒక రౌండ్‌ వేస్తే ఇందులో ఉన్న నాలుగు ప్యాలెస్‌లు, క్లాక్‌టవర్, బగ్గీఖానా, గుర్రాల విడిది ప్రదేశం… అన్నీ కవర్‌ అవుతాయి. పచ్చటి రకరకాల చెట్ల మధ్య గన్నేరు పూల సువాసనను ఆస్వాదిస్తూ సాగుతుంది చౌమొహల్లా రౌండప్‌. 

గ్రంథనిలయం
మెహ్‌తాబ్‌ మహల్‌లో ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉంది. ఖురాన్‌ గ్యాలరీలోకి వెళ్లేటప్పుడు చెప్పులు బయట వదలాలి. ఖురాన్‌ గ్రంథంతోపాటు అనేక ఉర్దూ పుస్తకాలు ప్రదర్శనలో ఉన్నాయి. తెరిచిన పుస్తకాలను ఉంచిన గ్రంథపీఠం కూడా సాదాసీదాగా లేదు. అవి కూడా వేటికవి ప్రత్యేకంగా అందమైన కళాకృతులే. బెల్జియం మిర్రర్‌ వర్క్‌ వాల్‌ హ్యాంగింగ్‌ ఉంది. అది షో పీస్‌ కాదు. ఖురాన్‌లో మంచి మాటను అద్దాలతో అమర్చిన కళాఖండం. అక్కడి నుంచి బయటకు వస్తే ఓ బాణం గుర్తు ఆఫ్జల్‌ మహల్, అఫ్తాబ్‌ మహల్, బగ్గీఖానాలను సూచిస్తుంది. 

ఆయుధాల ప్రదర్శన
దర్బార్‌ హాల్‌ వరండాలో అడుగుపెట్టగానే ఇద్దరు గ్రీకువీరులు కుస్తీపడుతున్న పాలరాతి శిల్పం మీద చూపు నిలిచిపోతుంది. ప్రవేశించగానే ప్రధాన మందిరానికి రెండు వైపుల ఉన్న గదుల్లో నిజామ్‌ ఫొటో గ్యాలరీ, క్లుప్తంగా వారి జీవిత చరిత్ర, ఆయిల్‌ పెయింటిగ్స్‌ ఉన్నాయి. వాటి నుంచి ముందుకు వెళ్తే ఒక మూలగా ఉన్న గదిలో ఆయుధాలు ప్రదర్శనలో ఉన్నాయి. అలాగే మరో మూలగా ఓ గది లో కూడా ఆయుధాలున్నాయి. కత్తులు, కటారులు, పిడిబాకులు, ఫిరంగులు, తుపాకులున్నాయి. మొత్తం ఐదువేల ఆయుధాలున్నట్లు ప్యాలెస్‌ డైరెక్టర్‌ కిషన్‌రావు చెప్పారు. డాలుగా తాబేలు డొప్పలను వాడేవారని తెలిసింది.

ఇక పై అంతస్థు… ప్రపంచదేశాలన్నీ తమవంతుగా కొలువుదీరినట్లు ఉంది. క్రాకరీ, కట్లరీ యూనిట్‌లో ఆస్ట్రియా, బెల్జియం, హాలండ్, జపాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, చెకోస్లోవియాల నుంచి సేకరించిన పింగాణీ, వెండి, గాజు డిన్నర్‌ సెట్‌లున్నాయి. ఇక్కడి గవాక్షాల నుంచి దర్బార్‌ హాల్‌ ప్రధానమందిరం, అందులో జరిగే కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తాయి. హాల్‌లో మొఘల్‌ శైలి పాలరాతి రాజపీఠం ఉంది. పక్కనే ఓ గదిలో ఆయిల్‌ పెయింటింగ్స్‌ గ్యాలరీ, అందులో మౌనంగా వీడియో ప్రదర్శన కొనసాగుతుంటుంది. మాటలు వినిపించకపోయినా కింద సబ్‌టైటిల్స్‌ అయినా వస్తుంటే ఆసక్తిగా చూడవచ్చు. టైటిల్స్‌ లేకపోవడం కొరత అనే చెప్పాలి. దర్బార్‌ హాల్‌ వెనుక వరండా వంటి పొడవైన గదిలో స్నూకర్‌ టేబుల్, ఫొటో గ్యాలరీ ఉన్నాయి. 

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పిల్లలు బిలబిలమంటూ ప్యాలెస్‌లోకి పరుగులు తీశారు. అంతా ఐదు నుంచి పదేళ్ల లోపు వాళ్లే. వాళ్లతోపాటు మరికొంత మంది మహిళలు. ఏదో స్కూలు… విద్యార్థులను ప్యాలెస్‌ టూర్‌కి తీసుకువచ్చింది. కోవిడ్‌ తర్వాత పర్యాటకం ఊపందుకుంటున్న నేపథ్యంలో పిల్లలను బయటకు తీసుకువెళ్లడానికి ఇది సరైన ప్రదేశమే. ఎందుకంటే పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో పచ్చటి చెట్ల మధ్య, విశాలమైన ప్యాలెస్‌లో హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ హాలిడేని సంతోషంగా ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం ఈ ప్యాలెస్‌ సముదాయం. ప్యాలెస్‌లో విహారం ఎలా ఉంటుందో ఒక్కమాటలో చెప్పాలంటే…  ‘స్కూలు పిల్లల ముఖాల్లో కాంతులీనుతున్న ఆనందంలాగ ఉంది’.

గంటకొట్టే గడియారం
అఫ్జల్‌ మహల్‌ ముందు జామెట్రికల్‌ డిజైన్‌లో రంగురంగుల పాలరాతి చిప్స్‌ఫ్లోరింగ్‌తో విశాలమైన వరండా. మహల్‌ అంతా ఉడెన్‌ ఫ్లోరింగ్‌. ఈ మహల్‌లో సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఉన్నట్లే గంట కొట్టే గడియారం ఉంది. ఆ హాల్‌లో మూడు రెక్కల ఫ్యాన్‌ పైన ఉన్న పైప్‌ను చూసినప్పుడు కానీ పై కప్పు కనీసం ముప్పై అడుగుల ఎత్తులో ఉందనే విషయం స్ఫురణకు రాదు. లోపలి గదిలో పియానో ఉందని చెప్పారు. కానీ పర్యాటకులకు ఆ గదిలోకి అనుమతి లేదు. ఈ మహల్‌ ఎడమవైపు కొద్దిగా వెనుకగా బగ్గీఖానా ఉంది. 


దుస్తుల గ్యాలరీ
ఆఫ్తాబ్‌ మహల్‌లోకి అడుగు పెట్టగానే గ్రీన్‌ గ్లాస్‌ షాండ్లియర్‌లు మెరుస్తుంటాయి. చిక్కటి గ్రీన్‌ షేడ్‌ను చెప్పడానికి గ్లాస్‌గ్రీన్‌ అనే పదం వాడుతుంటాం. గ్రీన్‌ గ్లాస్‌ అసలు షేడ్‌ ఈ షాండ్లియర్‌లను చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నిజామ్‌ కుటుంబీకులు ఉపయోగించిన దుస్తులున్నాయి. ఒక గదిలో షేర్వాణీలు, మరో రెండు గదుల్లో చీరలున్నాయి. బెనారస్, పైఠానీ, కోట చీరలు, జర్దోసి ఎంబ్రాయిడరీ దుస్తులు, టోపీలున్నాయి. దుస్తులను హ్యాంగర్‌లకు తగిలించకుండా మానిక్వైన్‌లకు కట్టి ఉండడంతో నిజామ్‌ కుటుంబం తాలూకు వైభవోపేతమైన జీవనం కళ్లకు కడుతుంది. ఇక్కడ హుక్కా పీల్చే ప్రదేశం కూడా ఉంది. ఇక తర్వాత చూడాల్సింది తహ్నియత్‌ మహల్‌. ఇందులో చూడడానికి ప్రదర్శనలో ఏమీ పెట్ట లేదు. ఈ ప్యాలెస్‌ను పెళ్లి, రిసెప్షన్‌ వంటి వేడుకలకు అద్దెకిస్తారు. 

ప్యాలెస్‌ కబుర్లు మరికొన్ని…

  • చౌ మొహల్లా ప్యాలెస్‌కి 1750లో సలాబత్‌ జంగ్‌ పునాదిరాయి వేశాడు. వందేళ్లు దాటిన రెండు దశాబ్దాలకు ఐదవ అసఫ్‌ జాహీ అఫ్జల్‌ అద్దౌలా పూర్తి చేశాడు. నిజామ్‌ వంశస్థుల్లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది నిజామ్‌ల కిరీటధారణలు ఇక్కడే జరిగాయి.
  • ఏ మహల్‌లోకి వెళ్లినా బెల్జియం గ్లాస్‌ షాండ్లియర్‌లే ప్రధానంగా కనిపిస్తాయి. దర్బార్‌ హాల్‌లో ఏకంగా పందొమ్మిది షాండ్లియర్‌లున్నాయి. 
  • క్లాక్‌టవర్‌కు అమర్చిన గడియారం పని చేస్తూనే ఉంది. వర్షాలకు గోడలు దెబ్బతినడంతో మరమ్మతులు జరుగుతున్నాయి. ∙ఈ ప్యాలెస్‌ సముదాయానికి ఇన్‌టాక్‌ హెరిటేజ్‌ రెండుసార్లు అవార్డు (2002, 2005లో) ఇచ్చింది.
  • 2010లో యునెస్కో ఈ మహల్‌కు ప్రత్యేకంగా ‘ఆసియా పసిఫిక్‌ మెరిట్‌ అవార్డు’ ప్రకటించింది. 
  • 2017లో నేషనల్‌ టూరిజమ్‌ డిపార్ట్‌మెంట్‌ ‘బెస్ట్‌ మెయింటెయిన్‌డ్‌ అండ్‌ డిఫరెంట్‌లీ ఏబుల్‌డ్‌ ఫ్రెండ్లీ మాన్యుమెంట్‌’ అవార్డు వచ్చింది.
  • ఈ ప్యాలెస్‌ పునరుద్ధరణ కోసం దాదాపుగా పది కోట్లు ఖర్చయ్యాయి. ప్రసిద్ధ ఆర్కిటెక్ట్‌ రాహుల్‌ మల్హోత్రా బృందం 2005 నుంచి 2010 వరకు శ్రమించి చౌమొహల్లా ప్యాలెస్‌ను పూర్వపు రూపానికి తీసుకువచ్చింది. 

నిజాం కార్లు
బగ్గీఖానాలో లండన్‌– ఎడిన్‌బర్గ్‌ చాసిస్‌ రోల్స్‌ రాయిస్, నేపియర్‌ కార్లు… మొత్తం ఎనిమిది వింటేజ్‌ కార్లు వరుసతీరి ఉన్నాయి. మేకోవర్‌ అయ్యి కొత్తగా మెరుస్తున్న రోల్స్‌ రాయిస్‌ సిల్వర్‌ ఘోస్ట్‌… హైదరాబాద్‌ నగరానికి వచ్చిన తొలి విదేశీ కారు. ఆ పక్కనే మరో షెడ్‌లో మూడు జీపులు, ఓ నిస్సాన్‌ కారు ఉంది. వీటితోపాటు మూడు మోటార్‌ బైక్‌లున్నాయి. ఒకటి హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌. మిగిలినవి రెడ్‌ ఇండియన్‌ షెఫ్స్, పారాట్రూపర్‌ బైక్‌. పక్కనే గుర్రపు బగ్గీలు కూడా బారులు తీరి ఉన్నాయి. పైకప్పు, తెరలతో ఆడవాళ్ల కోసం డిజైన్‌ చేసిన బగ్గీలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే విశాలమైన ప్రాంగణంలో గుర్రాలు సేదదీరేవని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. 

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి