శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది అని తెలిపారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి 100 శాతం గ్రాంట్‌తో చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నాము. 2021-22 ఏడాదికి 28,704 నీటి వనరులలో 93 కోట్ల చేప పిల్లలను, ఎంపిక చేసిన 200 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను నిల్వ చేయాలని ప్రతిపాదించాం. 81 రిజర్వాయర్లు, 1348 శాశ్వత చెరువులు, 27,275 వానాకాలం చెరువుల్లో చేపలను వదులుతున్నామని తెలిపారు. మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
సమైక్యాంధ్రలో మత్స్యకారులు నిర్లక్ష్యానికి గురయ్యారు. బడ్జెట్‌లో కూడా మత్స్యకారులకు నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వివిధ వర్గాలను ఆదుకునేందుకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.