పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో నలుగురు సభ్యులను హైదరాబాద్ బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను డీసీపీ పద్మజ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నదని చెప్పారు. తక్కువ పెట్రోల్ వచ్చేలా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందించారని, చిప్‌లను పెట్రోల్ బంకుల్లో అమరుస్తున్నారని చెప్పారు.
నిందితులంతా గతంలో పెట్రోల్ బంకుల్లో పనిచేశారని చెప్పారు. బంకు యజమానులు, నిందితులు కుమ్మక్కయ్యారని వెల్లడించారు. చిప్‌ల ఏర్పాటుతో లీటరుకు 30 నుంచి 50 మిల్లీ లీటర్లు తక్కువగా వస్తున్నదని డీసీపీ తెలిపారు. ఇలా మూడు రాష్ట్రాల్లోని 34 బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఇందులో తెలంగాణలో ఆరు పెట్రోల్ బంకులు, ఏపీ, కర్ణాటకలో 28 బంకులు ఉన్నాయని తెలిపారు.