ఆంధ్రప్రదేశ్

Jio and TTD : వెంకన్న ఆలయం డిజిటలైజేషన్‌.. జియో-టీటీడీ మధ్య ఎంఓయూ

(Jio and TTD) తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిజిటలైజ్‌ చేయనున్నారు. ఇందు కోసం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్‌) తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి సమక్షంలో జేపీఎల్ ప్రతినిధులు,టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఎంఓయూ కుదిరింది. ఆన్‌లైన్ టిక్కెట్ల కోటా విడుదలైనప్పుడల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పలు లోపాలు బయటపడిన నేపథ్యంలో టీటీడీ అధికారులు జేపీఎల్‌ను సంప్రదించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ సేవలను భక్తుల వద్దకు తీసుకెళ్లడంలో జియోమీట్‌, జియోటీవీ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను టీటీడీకి అందుబాటులోకి తీసుకురానున్నది.

అవగాహన ఒప్పందంలో భాగంగా, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, మద్దతు, ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఐటీ వనరులను సమీకరించడం, సైబర్ సెక్యూరిటీ టూల్స్ అందించడం, టీటీడీ పోర్టల్ నిర్వహణ, లైవ్ వీడియోను అందించడానికి బోర్డుకు ఎలాంటి ఖర్చు లేకుండా జేపీఎల్‌ తన సేవలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు ఈ-దర్శన్ కోసం ఫీడ్ అందిస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమర్‌నాథ్ భక్తులకు స్వామి వారి హారతిని తిలకించేందుకు జియో సంస్థ విశేష సేవలను అందించింది. వీటిని చూసిన టీటీడీ అధికారులు, తిరుమలలో కూడా వారి సేవలను అందుకోవాలని నిర్ణయించారు.