ఆంధ్రప్రదేశ్

brahmotsavam | క‌ల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజ‌మ‌న్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి క‌ల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో వాహనసేవ నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వభూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి.

క‌ల్పవృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శనమిచ్చారు.