కోవిడ్ వేళ భారతీయ ప్రయాణికుల ఎంట్రీ విషయంలో బ్రిటన్ ఇటీవల ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ ప్రధాని మోదీకి ఫోన్ చేసిన మాట్లాడారు. భారతీయ కోవిడ్ టీకా సర్టిఫికేట్‌కు బ్రిటన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ సంభాషణ సాగినట్లు తెలుస్తోంది. రెండు డోసుల కోవీషీల్డ్ తీసుకున్నవారికి బ్రిటన్‌లో ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎంట్రీ కల్పిస్తున్నారు. దేశాధినేతలిద్దరూ తమ ఫోన్ సంభాషణలో.. కరోనా వైరస్ గురించి చర్చించారు. అంతర్జాతీయ ప్రయాణాలను ఎలా ప్రారంభించాలన్న అంశాల్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. భారతీయ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను బ్రిటన్ గుర్తించడం సంతోషకరమని మోదీ అన్నారు. ఇటీవల రెండు దేశాల మధ్య వ్యాక్సిన్ సర్టిఫికేట్ అంశంలో భేదాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే.
కోవీషీల్డ్ తీసుకున్నా.. రెండు వారాలు క్వారెంటైన్‌లో ఉండాలని యూకే ఓ నిబంధన పెట్టింది. ఆ నిబంధనను వ్యతిరేకించిన భారత్.. బ్రిటన్ పౌరులపై కూడా క్వారెంటైన్ ఆంక్షలను అమలు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య కాస్త ఘర్షణ కొనసాగింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ ఇవాళ తన ట్వీట్‌లో తెలిపారు. ఇండియా-యూకే ఎజెండా 2030 గురించి సమీక్ష జరిపామని, గ్లాస్‌గోలో జరగనున్న కాప్-26 సమావేశాల నేపథ్యంలో వాతావరణ మార్పుల గురించి కూడా చర్చించినట్లు మోదీ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతీయ అంశాల గురించి కూడా బోరిస్‌తో మాట్లాడినట్లు మోదీ తన ట్వీట్‌లో వెల్లడించారు.