అజేయమైన శక్తి కలిగిన సైన్యాన్ని నిర్మించనున్నట్లు నార్త్ కొరియా నేత కిమ్ జాన్ ఉంగ్ తెలిపారు. ఉత్తర కొరియా అవలంభిస్తున్న విధానాలపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. కిమ్ నేతృత్వంలోని ఆ దేశం తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటూనే పోతోంది. ఆత్మరక్షణ కోసం ఆయుధాలను సమీకరిస్తున్నామని, యుద్ధం చేయడానికి కాదని కిమ్ అన్నారు. తాజాగా జరిగిన డిఫెన్స్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ షోలో రకరకాల క్షిపణులను ప్రదర్శించారు. ఇటీవల బాలిస్టిక్, క్రూయిజ్‌కు చెందిన వివిధ మిస్సైళ్లను ఉత్తర కొరియా పరీక్షించిన విషయం తెలిసిందే. వాటిల్లో హైపర్‌సోనిక్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైళ్లు కూడా ఉన్నాయి.
మరో వైపు దక్షిణ కొరియా కూడా తన ఆయుధ సత్తాను సమీక్షించుకున్నది. స్వంత జలాంతర్గామి ద్వారా ఆయుధాన్ని పరీక్షించే టెక్నాలజీని డెవలప్ చేసింది. ప్యోంగ్‌యాంగ్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో కిమ్ మాట్లాడుతూ.. తమ పొరుగు దేశమైన సౌత్ కొరియాతో ఎటువంటి వైరాన్ని కోరుకోవడం లేదన్నారు. ఎవరితోనూ యుద్ధం గురించి ప్రస్తావించడం లేదని, కానీ ఆ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని, జాతీయ సమగ్రత రక్షణ కోసం ఆయుధ సంపత్తిని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు.