జాతీయం

న్యాయవాద వృత్తిలాభార్జనకు కాదు

  • సమాజ సేవే ఆశయం కావాలి
  • న్యాయ సహాయ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర భేష్‌: సీజేఐ
  • మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభం

న్యాయవాద వృత్తి ఉన్నది లాభార్జనకు కాదని, సమాజానికి సేవ చేయడానికని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన విద్యార్థులు సమాజంలో బలహీన వర్గాల గొంతుక కావాలని సూచించారు. ‘న్యాయ సహాయ ఉద్యమంలో చేరాలన్న మీ నిర్ణయం గొప్ప కెరీర్‌కు బాటలు వేస్తుంది. ఇతరులను అర్థం చేసుకోవడం, నిస్వార్థ భావనను మీకు అలవరుస్తుంది. న్యాయవాద వృత్తి ఇతర వృత్తులకు భిన్నమైనదనే విషయాన్ని గుర్తుంచుకోండి.

లీగల్‌ ప్రొఫెషన్‌ అంటే లాభాలు సంపాదించడం కాదు. సమాజానికి సేవ చేయడమ’ని న్యాయ విద్యార్థులకు ఉద్బోద చేశారు. న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా మంగళవారం జాతీయ న్యాయ సేవా సంస్థ (నల్సా) నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. ‘మీ చుట్టూ ఉన్న సామాజిక వాస్తవాలపై అప్రమత్తంగా ఉండటం మీ బాధ్యత. వాటిపై స్పందించడంలో మీ పాత్ర గురించి ఆలోచన కలిగి ఉండాలి. న్యాయ సేవా సంస్థల ద్వారా న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకోగలుగుతున్నారు. ఇది వారికెంతో ఉపయోగకరమ’ని తెలిపారు. జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండటంపై కేంద్ర న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు.

మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభం

సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయంలో మధ్యవర్తిత్వ కేంద్రం (మీడియేషన్‌ సెంటర్‌), నల్సా కార్యాలయాన్ని సీజేఐ జస్టిస్‌ రమణ ప్రారంభించారు. సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, మీడియేషన్‌, కన్సిలియేషన్‌ ప్రాజెక్ట్‌ పర్యవేక్షణలో మీడియేషన్‌ సెంటర్‌ పనిచేస్తుంది. సుప్రీంకోర్టు అప్పగించిన కేసులను శిక్షణ పొందిన మధ్యవర్తుల ప్యానెల్‌ చేపడుతుంది.