- ఇథనాల్ ధర లీటరుకు 1.47 పెంపు
- సీసీఐకి రూ.17,409 కోట్లు
- కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్స్) పునరుద్ధరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధ వారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. మిగిలిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎంపీల్యాడ్స్‌లో భాగంగా ఒక్క విడుతలో రూ. 2 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఏడాదికి రూ. 5 కోట్లు (రెండు విడుతల్లో) చొప్పున ప్రతి ఎంపీకి అందుతాయని వెల్లడించారు. కరోనా సంక్షోభం కారణంగా గతేడాది ఏప్రిల్‌లో ఎంపీల్యాడ్స్ నిధుల విడుదలను నిలిపివేయడం తెలిసిందే. మరోవైపు, భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని ‘జంజాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇథనాల్ ధర పెంపు
పెట్రోల్ బ్లెండింగ్ కోసం చెరకు నుంచి తీసిన ఇథనాల్ ధరను లీటరుకు 1.47 పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఈ రకం ఇథనాల్ ధర లీటరుకు రూ.63.45కు పెరిగింది. అలాగే, మద్దతు ధరకు పత్తిని సేకరించే నిమిత్తం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు రూ. 17,408.85 కోట్లను కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.