తెలంగాణ

గులాబీ దండు రైతన్నకు దన్ను

  • తెలంగాణ వడ్లు కొంటరా? కొనరా
  • రేపు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు
  • అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్లకు లేఖలు
  • ధర్నాల ఏర్పాట్లలో నేతలు తలమునకలు
  • నిరసన సెగలు ఢిల్లీకి తాకేలా కార్యాచరణ
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు
  • కార్యకర్తలకు మంత్రులు, నేతల దిశానిర్దేశం

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి. వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ చేపట్టే నిరసన సెగ ఢిల్లీకి తాకాలి. ధర్నాలు భారీ ఎత్తున నిర్వహించేలా కార్యాచరణ ఉండాలి.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రాష్ట్ర రైతాంగానికి గులాబీ దళం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను దునుమాడేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునివ్వటంతో పార్టీ శ్రేణులు ఈ మేరకు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన అనంతరం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతాంగాన్ని గందరగోళానికి గురిచేస్తున్నదని టీఆర్‌ఎస్‌ ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నది. పంట చేతికొచ్చినా కొనుగోలు విషయం తేల్చకుండా కేంద్రం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణిని ధర్నా సందర్భంగా ఎండగట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వేల మంది రైతాంగంతో అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు నాయకులు దరఖాస్తు చేశారు. మరోవైపు ధర్నాలు చేపట్టే ప్రాంతాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. నియోజకవర్గాల పరిధిలోని అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు, ఆయా నియోజకవర్గాల్లోని రైతుబంధు సమితుల ప్రతినిధులు, రైతులు భారీ ఎత్తున పాల్గొని నిరసన ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ప్రత్యేకించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రైతులను తప్పుదారి పట్టించేలా చేస్తున్న వ్యాఖ్యలను రైతాంగం ముందు ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ చేపట్టే నిరసన సెగ ఢిల్లీకి తాకేలా భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలను నిర్వహించేలా కార్యాచరణ ఉండాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశంచేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నిబంధనల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకొని నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ధాన్యం కొనేదాకా ఆందోళనలు: ఎర్రబెల్లి

ధాన్యం కొనుగోలుపై శుక్రవారం టీఆర్‌ఎస్‌ తలపెట్టిన ధర్నాలను విజయవంతంచేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ శ్రేణులు, రైతులకు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రైతులతో ధర్నాలు చేయాలని కోరారు. రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేతలు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇండ్ల ముందు ధర్నా చేయాలన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వీ సతీశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం రైతుల నోట్లో మట్టి కొట్టేలా ధాన్యం కొనుగోలుకు ససేమిరా అనడం బాధాకరమన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ధర్నాకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కోరారు.

రైతులతోనూ వ్యాపారానికిబీజేపీ యత్నం : గంగుల

వడ్ల కొనుగోలుకు కేంద్రం దిగొచ్చేదాకా రాష్ట్ర రైతాంగం పక్షాన టీఆర్‌ఎస్‌ పోరాడుతుందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టంచేశారు. ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. బుధవారం కరీంనగర్‌లో గంగుల మీడియాతో మాట్లాడుతూ, యాసంగి వడ్ల కొనుగోళ్లలో కేంద్రం నిరంకుశ వైఖరిపై మండిపడ్డారు. రైతులు పండించిన పంటల ను లాభనష్టాలు చూడకుండా కొనుగోలు చేయాల్సిన కేంద్రం.. వారితో వ్యాపా రం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు విజయ, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

వేల్పూర్‌ ఎక్స్‌రోడ్డులో ధర్నా: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ధాన్యం కొనుగోలుపై కేంద్రం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా వేల్పూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించే ధర్నాలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులోని స్వగృహంలో పార్టీ మండల కన్వీనర్లు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్లతో మాట్లాడుతూ యాసంగి వడ్లు కేంద్రమే కొంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆర్డర్‌ కాపీ తేవాలని డిమాండ్‌ చేశారు.

రెవెన్యూ ఆఫీసుల ముందు ధర్నాలు: రైతునేత పోలాడి రామారావు

తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్టు రైతు నేత, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని ఓసీ సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రైతులపట్ల సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమాఖ్య కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, జనతాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి వాసు, నాయకులు దుబ్బా శ్రీనివాస్‌, వల్లూరి పవన్‌కుమార్‌, సత్యమోహన్‌శర్మ, చింతిరెడ్డి రమణారెడ్డి, వంగల హనుమంతు, బుస్సా శ్రీనివాస్‌, పినిశెట్టి రాజు, కొలగూరి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.