అంతర్జాతీయం ముఖ్యాంశాలు

చైనాలో కరోనా కలకలం.. బీజింగ్‌లో మా‌ల్‌, హౌసింగ్‌ కాలనీల మూత

చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఆకస్మికంగా వైరస్‌ వ్యాప్తిస్తున్నది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బీజింగ్‌లోని సెంట్రల్ జిల్లాలైన చాయాంగ్, హైడియన్‌లలో గురువారం ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో వైరస్‌ సోకిన వ్యక్తుల సన్నిహితుల నుంచి వ్యాపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

మరోవైపు వైరస్‌ నియంత్రణకు చైనా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కరోనా సోకిన వ్యక్తిని కలిసిన ఒక వ్యక్తి సందర్శించిన డాంగ్‌చెంగ్‌లోని రాఫెల్స్ సిటీ మాల్‌ను బుధవారం సాయంత్రం మూసివేశారు. అందులోని సిబ్బంది, కస్టమర్లకు కరోనా పరీక్ష నిర్వహించే వరకు బయటకు పంపలేదు. గురువారం కూడా ఆ మాల్‌ మూసివేత కొనసాగింది.

కాగా, ఐదు హౌసింగ్‌ కాలనీలు, ఒక ప్రాథమిక పాఠశాల, రెండు అధికార కార్యాలయాల వద్ద లాక్‌డౌన్‌ విధించారు. ఆ కాలనీ వాసులకు సామూహికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించిన హౌసింగ్‌ కాలనీల్లోని ప్రజలకు ఫుడ్‌ ప్యాకెట్లు అందజేశారు.

చాయోయాంగ్, హైడియన్ జిల్లాల్లో కరోనా వ్యక్తులను కలిసిన 280 మందికిపైగా వ్యక్తులను గుర్తించామని, 12,000 మందికిపైగా స్క్రీనింగ్‌ చేసినట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. ‘ఈరోజు చాలా కీలకమైన రోజు. వీలైనంత త్వరగా వ్యాప్తి మూలాన్ని కనుగొనడం అవసరం’ అని ఒక ప్రభుత్వ అధికారి ప్రకటించారు.

దేశీయంగా ప్రయాణాలు బాగా పెరిగిన నేపథ్యంలో చైనాలో మరోసారి కరోనా వ్యాప్తి చెందుతున్నదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు. దేశ సరిహద్దుల మూసివేత కూడా కొనసాగుతున్నది.