కరోనా మహమ్మారిని నిలువరించడం కోసం అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ విషయంపై స్పందించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా ఉందని ఆమె అన్నారు.
ఇతరులను కరోనా నుంచి కాపాడటం కోసం ఈ పని చేసి తీరాలని సూచించారు. న్యూజిల్యాండ్ ప్రధాని జకిండా ఆర్డెర్న్‌తో జరిగిన ఒక వర్చువల్ మీటింగ్‌లో ఏంజెలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ చాలా కఠినమైనదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ జర్మనీలోని 83 మిలియన్ల మంది జనాభాలో మూడొంతుల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
కాగా, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టినా యూరప్ దేశాల్లో మాత్రం పరిస్థితి ఇంకా చక్కబడలేదని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అధికశాతం ఐరోపా దేశాల్లోనే ఉన్నాయని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.