నీట్ పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు (supreme court) స్పష్టం చేసింది. ఈ మేరకు పరీక్ష పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి బాంబే హైకోర్టు జారీచేసిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విద్యార్థులకు ఎదురైన పరిస్థితి పట్ల కోర్టు విచారం వ్యక్తం చేసింది.
అయితే వారిద్దరికి మాత్రమే మళ్లీ పరీక్ష నిర్వహించడం చాలా కష్టతరమైన ప్రక్రియ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్రకు చెందిన ఆ ఇద్దరు విద్యార్థులకు పరీక్ష నిర్వహించాలని బాంబే హైకోర్టు అక్టోబర్ 20న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎన్‌టీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.