బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారిందని, దీంతో రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్- ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న అల్పపీడనం నైరుతిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడి, వాయుగుండంగా మారి చెన్నైకి 310 కిలో మీటర్ల దూరంలో పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నది. వాయుగుండం పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది.
రెండు రోజులు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడన ప్రాంతం నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొన్నది. వీటి ప్రభావంతో గురువారం రాత్రి, శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గురువారం రాత్రి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో.. శుక్రవారం నాడు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. అలాగే ఆది, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
24 గంటల్లో 27 జిల్లాల్లో మోస్తరు వర్షం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 27 జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసినట్లు టీఎస్‌డీపీఎస్ పేర్కొన్నది. రాష్ట్రంలో అత్యధికంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియంకొండ 5, ఆత్మకూర్ 4.08, గోపాల్‌పేట 4.08, అమరచింత 3.25 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వివరించారు.
రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 19.1 డిగ్రీల సెల్సీయస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, అత్యధికంగా ములుగు జిల్లా వాజేడులో 36.8 డిగ్రీల సెల్సీయస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైటన్లు చెప్పారు. రాత్రి ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల వరకు పెరగ్గా పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయని, చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొన్నది.