రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను కాపాడుకునేందుకు యుద్ధం ప్రారంభించాం.. చివరిదాకా కొట్లాడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు.
ఒకటే మాట చెప్తున్నా.. ప్రధాన మంత్రి గారు.. మీకు దండం పెట్టి, రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా నేను అడుగుతున్నాను. మేం యాసంగిలో వరి వేయాలా? వద్దా? ఒకటే మాట చెప్పండి. మీరు తీసుకుంటరా? తీసుకోరా? మా సావు ఏదో మేం సత్తాం. వేస్తే ఏం చేయాలో ఆలోచించుకుంటాం. ఏ దారి పట్టాల్నో ఆలోచిస్తాం. అది చెప్పకుండా అబద్దాలు మాట్లాడుతున్నారు. రెండు, మూడు రోజులు వేచి చూస్తాం.. ఆ తర్వాత యుద్ధాన్ని ప్రజ్వలింపజేస్తాం. ఎక్కడిదాకా తీసుకుపోవాల్నో అక్కడిదాకా తీసుకుపోతాం.
కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నా.. ఈరోజు ప్రారంభమైంది. మేం పదవుల కోసమో.. ఇంకో దాని కోసమో.. మీరు పెడ్తమన్న కేసుల కోసమో.. భయపడే బాపత్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. మేం అడిగేది ప్రజల సమస్యల గురించి. రాజకీయాలు ఉంటే తర్వాత.. కానీ ప్రజల సమస్యలపై సమాధానం చెప్పు. రాజకీయాలు పక్కన పెడితే.. రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్‌ను మించిన పార్టీనే లేదు. మేం యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా కొట్లాడుతాం. దేనికి కూడా భయపడం.. అదే విధంగా ముందుకు సాగుతాం. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుంటాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.