Jats key in West UP | వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన.. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా.. లేదా అన్నది తేలాల్సి ఉంది. తెలుస్తున్నది. ప్రధాని మోదీ ప్రకటనతో పంజాబ్‌లో పోటీ చేసే విషయమై గానీ, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సానుకూల ఫలితాలపై ఉన్న డైలమా తొలిగిపోయినట్లేనంటున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన కర్షకుల ఆందోళన ప్రాథమికంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికే పరిమితం అన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
తికాయిత్‌లు పశ్చిమ యూపీ వాసులే
భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకులు రాకేశ్ తికాయిత్, నరేశ్ తికాయిత్‌లు పశ్చిమ యూపీకి చెందిన వారు. తికాయిత్‌లు జాట్ సామాజికవర్గ నేతలు. దీంతో రైతు ఉద్యమానికి సారధ్యం వహించిన బీకేయూ నాయకత్వం వెనుక జాట్ రైతులంతా నిలిచారు. సంయుక్త కిసాన్ మోర్చా బ్యానర్ కింద పని చేసిన నరేశ్ తికాయిత్, రాకేశ్ తికాయిత్‌ల ప్రభావం పశ్చిమ యూపీ, తెరాయి రీజియన్లలో ఉంటుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత రైతుల సమస్యలపై చర్చ జరగడం సాధారణంగా కనిపిస్తోంది.
కులాల వారీగా రైతుల్లో విభజన
కానీ జాట్లు ఏనాడు ఓటుబ్యాంకుగా ఏనాడు సంఘటితం అయిన దాఖలాలు లేవు. యూపీ, బీహార్‌లతోపాటు దేశంలోని రైతులంతా కులాలు, రాజకీయాల వారీగా విడిపోయారే గానీ ఏ పార్టీకి, అభ్యర్థికి వ్యతిరేకం కానీ, అనుకూలంగా కానీ వ్యవహరించిన దాఖలాలు లేవు. కానీ ఈ దఫా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జాట్ పాలిటిక్స్ ప్రభావితం చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అజిత్ సింగ్ తనయుడికీ ఈ పోల్స్ కీలకం
తికాయిత్‌లు మాత్రమే కాదు.. కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి సారధ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) ప్రాథమికంగా జాట్ల మద్దతుపైనే ఆధారపడి పని చేస్తున్నది. ఈ దఫా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను సొమ్ము చేసుకోవడానికి ఆర్ఎల్డీ కూడా ప్రయత్నించే అవకాశాలు ఫుష్కలంగా ఉన్నాయి. అజిత్‌సింగ్ మరణం తర్వాత జయంత్ చౌదరి సారధ్యంలోని ఆర్ఎల్డీ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నది. పార్టీ ఓటుబ్యాంకును పటిష్టం చేసుకోవడంతోపాటు తన స్థానాన్ని పదిలపర్చుకోవడం జయంత్ ముందు ఉన్న సవాల్.
జాట్ల మద్దతు కోసం ఆర్ఎల్డ్ పాట్లు ఇలా
పశ్చిమ యూపీలోని ఆర్ఎల్డీ వర్కర్లు కృషి కానూన్ టు బహానా హై జయంత్ చౌదరికో జమానా హై అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని బీజేపీ నేత ఒకరు చెప్పారు. జాట్ల ఓటుబ్యాంకును కోల్పోయిన ఆర్ఎల్డీకి రైతు ఉద్యమం కొత్త ఊపిరినిచ్చిందనడంలో సందేహం లేదని బీజేపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఆర్ఎల్డీ అధికార ప్రతినిధి రోహిత్ అగర్వాల్ స్పందిస్తూ రైతుల పక్షాన నిలిచేది ఆర్ఎల్డీ మాత్రమేనని రుజువైందన్నారు. జాట్లు, గుర్జార్లు సోదరులని పేర్కొన్నారు.
2014లో ఇలా జాట్లలోకి బీజేపీ
తొలి నుంచి జయంత్ చౌదరి తండ్రి అజిత్‌సింగ్‌కు మద్దతుగా ఉన్న జాట్లలోకి 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల తర్వాత బీజేపీ చొచ్చుకెళ్లగలిగింది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్ యూపీలోని 17 స్థానాలనూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలకు 60 సీట్లను బీజేపీ గెలుచుకున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాస్త పరిస్థితిలో మార్పు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీ చేయడంతో పశ్చిమ యూపీలో బీజేపీ 10 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మిగతా ఏడు స్థానాలు ఎస్పీ, బీఎస్పీలు గెలుచుకున్నాయి. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో అత్యధిక జాట్ల ఓట్లను పొందగలిగిందని ఓ బీజేపీ నేత చెప్పారు. అయితే, అన్నివేళలా అది సాధ్యంకాదని అన్నారు.
జాట్ రైతుల ఆలోచనల్లో మార్పులు
వ్యవసాయ చట్టాలతో ఒకింత గందరగోళానికి గురైన జాట్ ఓటర్లు తమ విధేయతను మార్చుకునే ఆలోచనలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్ఎల్డీకి వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే సమస్య కాదని, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తున్నదని ప్రజల్లో అవగాహన కల్పించాయని అంటున్నారు. ప్రధాని మోదీ దూరదృష్టితోనే సాగు చట్టాలను రద్దు చేశారని బీజేపీ అధికార ప్రతినిధి అవినీశ్ త్యాగి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నేత సురేంద్ర సింగ్ రాజ్‌పుట్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతోనే ప్రధాని మోదీ సాగు చట్టాలను విత్ డ్రా చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. బీజేపీ ఉద్దేశాలు రైతులు, యువతకు తెలుసునని, వారు కమలనాథుల వలలో పడరని వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి