ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయలసీయలో వానలు ఎన్నడూలేని విధంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలతో తిరుపతి రామచంద్రాపురంలోని రాయల చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరద నీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి కొద్దికొద్దిగా జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు సమీప ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఒకవేళ రాయల చెరువు తెగితే సుమారు వంద పల్లెలకు ముంపు ప్రమాదం పొంచి వుందని అధికారులు చెబుతున్నారు.
దీంతో చెరువు దిగువన పల్లెలను అధికారులు అప్రమత్తం చేశారు. అంతేగాక రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరు,వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో ప్రజలను అప్రమత్తం చేశారు. పల్లెలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరినరయన్ తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడే పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.