కట్ట బలోపేతానికి అవిశ్రాంతంగా అధికారుల కృషి
ఇసుక, క్వారీ డస్ట్ బస్తాలతో లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు యత్నం
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని సుమారు 500 ఏళ్లనాటి రాయలచెరువు పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉంది. 1,050 ఎకరాల్లో 0.9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ చెరువు నిండుకుండను తలపిస్తోంది. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో చెరువు కట్టకు లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా అధికారయంత్రాంగం క్షేత్రస్థాయిలో కట్ట బలోపేతం చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. సమీపంలోని 17 గ్రామాలకు చెందిన దాదాపు 20వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతులు కల్పించారు.
నిపుణుల పరిశీలన
రాయలచెరువు కట్టను సోమవారం తిరుపతి, చెన్నై ఐఐటీల సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు జానకీరామయ్య, రోషన్ శ్రీవాస్తవ, మైనర్ ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, సోమశిల ప్రాజక్టు సీఈ హరినారాయణరెడ్డి, జలవనరుశాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి పరిశీలించారు. లీకేజీలను త్వరితగతిన అరికట్టాలని, అవుట్‌ఫ్లోను 3వేల కూసెక్కులకు పెంచాలని సూచించారు. చెరువు పటిష్టతకు కనీసం 35వేల ఇసుక మూటలు అవసరమవుతాయన్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవతో భారతీ సిమెంట్స్ యాజమాన్యం పంపిన 50వేల సంచుల్లో ఇసుక, కంకర నింపి కట్ట పనులను అధికారులు వేగవంతం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన చెరువు కట్టను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఉన్నారు.